అధ్యాపకులు.. అన్నదాతలు..
మంచిర్యాలఅర్బన్: చదువుపై ఎంత ఆసక్తి ఉన్నా అర్ధాకలితో పాఠాలపై శ్రద్ధ వహించడం కష్టమే. పొద్దున కళాశాలకు వచ్చి సాయంత్రం వరకు ఖాళీ కడుపుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను అధ్యాపకులు గుర్తించారు. మధ్యా హ్న భోజనం ఏర్పాటు చేసి ఆకలి తీర్చి చదువుపై దృష్టి సారించేలా అండగా నిలుస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 750 విద్యార్థులు ఉన్నారు. కళాశాలపై భరోసాతో వచ్చిన విద్యార్థుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా బోధనతోపాటు మధ్యాహ్న భోజనంపైనా అధ్యాపకులు దృష్టి సారించారు. సొంత డబ్బులతో మధ్యాహ్న భోజనం అమలు చేస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.
ప్రత్యేక తరగుతులు
కళాశాల విద్యార్థులు ఇంటర్ వార్షిక పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. నవంబర్ ఒకటి నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఎంసెట్ కోచింగ్, స్పెషల్ ప్రిపరేషన్ జరుగుతోంది. ఉదయం 9గంటల నుంచి 9.45గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ఉద యం 8గంటలకు వచ్చిన విద్యార్థులు ఇల్లు చేరేసరి కి రాత్రి 8గంటలు అవుతోంది. ఉదయం అల్పాహా రం తిని వచ్చే వెసులుబాటు లేక రాత్రి వరకు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో కళాశాలలో చెప్పే పాఠాలు అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు.
పెరిగిన హాజరు శాతం
కళాశాలలోని 750మంది విద్యార్థుల్లో టిఫిన్ బాక్సులు తెచ్చుకునే వారు 300 నుంచి 350 వరకు ఉంటా రు. కొందరు ఆకలితో మధ్యాహ్నం కళాశాల నుంచి వెళ్లిపోవడం అధ్యాపకులు గమనించి మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ఆలోచన చేశారు. డి సెంబర్ ఒకటి నుంచి అధ్యాపకులు తమకు తోచిన విధంగా తలా కొంత డబ్బులు వేసుకుని అక్కడే వంట తయారు చేసి భోజనం వడ్డిస్తున్నారు. రోజు కు రూ.3వేల నుంచి రూ.3,500 వరకు ఖర్చు చేస్తున్నారు. అన్నం, కూరతో కడుపునిండా భోజనం వ డ్డిస్తుండడంతో విద్యార్థులు కళాశాలను వీడడం లేదు. దీంతో హాజరు శాతం పెరిగింది.
హాస్టల్ విద్యార్థుల బాధలు వర్ణణాతీతం
జిల్లా కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కళాశాల వసతిగృహాలు ఆరు ఉన్నాయి. ఒకటి మినహా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు వసతిగృహాలన్నీ దూరంగా ఉంటాయి. కిలోమీటర్ల మేర నడిచి కళాశాలకు రావాల్సి ఉంటుంది. దీంతో ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అప్పుడే వడ్డిస్తున్నారు. టిఫిన్ బాక్స్‌లో పెట్టుకుని వచ్చిన ఆహారం మధ్యాహ్నం వరకు చల్లగా ఉండడం వల్ల విద్యార్థులు ఇష్టపడడం లేదు. భోజనం తిన్నా తినకున్నా విద్యార్థుల లెక్క(హాజరు)ల్లో తేడా చూపడం లేదని తెలుస్తోంది. వసతిగృహ విద్యార్థులు కూడా ప్రస్తుతం కళాశాలల్లోనే భోజనం చేస్తున్నారని తెలుస్తోంది. కళాశాలలో విద్యార్థుల అర్ధాకలిని గుర్తించి మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు అధ్యాపకులు ముందుకు వచ్చారని డీఈఐవో అంజయ్య తెలిపారు.


