ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
నార్నూర్: మండలంలోని ఉమ్రీ గ్రామ శివారు వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకుని జాదవ్ నరేశ్ (18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై గణపతి తెలిపారు. జైనూర్ మండలంలోని అంద్‌గూడ గ్రామానికి చెందిన జాదవ్ సునీత, అన్నాజీ దంపతుల కుమారుడు జాదవ్ నరేశ్ బతుకు దెరువు కోసం నార్నూర్ మండలం ఉమ్రీ గ్రామానికి చెందిన జాదవ్ రాణారంజిత్ దగ్గర నాలుగేళ్లుగా పాలేరుగా పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం ఎద్దులను మేపడానికి జాదవ్ రాణారంజిత్ పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం ఏడు గంటల వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో యజమాని రాణారంజిత్ పొలానికి వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకుని ఉండడంతో వెంటనే గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు రాత్రి వచ్చి చెట్టుకు శవమై ఉన్న కొడుకును చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ కొడుకు మృతిపై అనుమానం ఉందని మృతుడి తల్లి జాదవ్ సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
మంచిర్యాల క్రైం: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై మజారొద్దిన్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని హమాలీవాడకు చెందిన ఆకోజి రాజు(45), భార్య భారతిల మధ్య కుటుంబ కలహాలున్నాయి. దీంతో గత ఐదు సంవత్సరాల నుంచి భారతి భర్తకు దూరంగా జైపూర్ మండలం ఇందారంలోని తల్లిగారింటి వద్ద ఉంటుంది. అప్పటి నుంచి రాజు మద్యానికి బానిసయ్యాడు. అప్పుడప్పుడు తన తల్లి విజయలక్ష్మి ఇంటికి వచ్చిపోయేవాడు. గత నెల 25వ తేదీన రాజు ఇంటికి వచ్చి వెళ్లాడు. ఈక్రమంలో సోమవారం స్థానిక కట్ట పోచమ్మ చెరువు కాలువలో రాజు మృతదేహం లభ్యమైంది. సుమారు నాలుగు రోజుల క్రితం మృతి చెంది ఉండడంతో మృతదేహం కుళ్లిపోయింది. రాజుకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రాజు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మోసం చేసిన వ్యక్తిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: నమ్మించి మోసం చేయడంతో పాటు బాధితుడిని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు సోమవారం తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్‌కు చెందిన షేక్ అక్బర్, కారులో పాన్‌మసాలా తరలిస్తూ మహారాష్ట్రలోని మాండ్వి వద్ద అక్కడి పోలీసులకు చిక్కాడు. ఆదిలాబాద్ పట్టణంలో ఓ అడ్వకేట్ వద్ద క్లర్క్‌గా పని చేసే తాహెర్ అహ్మద్ ఖాన్ వాహనాన్ని విడిపిస్తానని నమ్మించి షేక్ అక్బర్ వద్ద రూ.44వేలు తీసుకున్నాడు. వాహనాన్ని విడిపించకపోవడంతో బాధితుడు ప్రశ్నించాడు. దీంతో అతనిపైనే కేసు పెట్టిస్తానని బెదిరించి మరో రూ.9వేలు వసూలు చేశాడు. వాహనం విడిపించకపోడం, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
అన్నను కొట్టి చంపిన తమ్ముడు
రామకృష్ణాపూర్: తోడబుట్టిన అన్ననే తమ్ముడు కొట్టి చంపిన ఘటన మందమర్రి మండలం సండ్రోన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మందమర్రి పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెండ్రపు గోపాల్ (35), మెండ్రపు కుమార్‌లు అన్నదమ్ములు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. సోమవారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో కూర్చొని మద్యం తాగారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘర్షణ చోటుచేసుకోవడంతో తమ్ముడు కుమార్ క్షణికావేశంలో రోకలిబండతో అన్న గోపాల్ తలపై బాది హత్య చేశాడు. సమాచారం అందుకున్న సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సైలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు.


