ముగిసిన వెబినార్
బాసర: ఆర్జీయూకేటీలో ‘ఏఐ, పీఈజీఏ ఎమర్జింగ్ టెక్నాలజీస్’పై జరిగిన అంతర్జాతీయ వెబినార్ సిరీస్ సోమవారం విజయవంతంగా ముగిసింది. ఇండియా, యూఎస్‌ఏ, కొలంబియాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పాల్గొనేవారిని ఆకర్షించే విధంగా బహుళ నిపుణుల సెషన్లు ఇందులో నిర్వహించారు. ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ (వైస్ ఛాన్సలర్) ప్రొఫెసర్ ఇ. మురళి దర్శన్ (ఓఎస్టీ) డా. నమాని రాకేశ్ (కౌన్సిలర్, ఐఈఈఈ ఎస్బి ఆర్జీయూకేటీ బాసర), శ్రీ సాయిరోహిత్ తుమ్మరకోటి మార్గదర్శకత్వంలో వెబినార్ రూపొందించారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
బాసర: బాసర సరస్వతి అమ్మవారిని సోమవారం తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ కమిషనర్ సత్యనారాయణ, హై కోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ జవహర్‌లు తమ కుటుంబాలతో వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి అమ్మవారి హారతి, తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు.
కోతుల బెడద తీర్చే వారికే ఓటు
దండేపల్లి: మండల కేంద్రంలో నెలకొన్న కోతుల బెడదను తీర్చే వారికే పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తామంటూ, దండేపల్లిలో బస్టాండు వద్ద గ్రామస్తులు సోమవారం ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, కోతుల బెడదను తీరుస్తామని హామీ ఇచ్చే వారికే పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తామని తేల్చి చెప్పారు.
లోన్ కట్టకుంటే న్యూడ్ ఫొటోలు
పంపుతామని బెదిరింపులు
బోథ్: లోన్ కట్టకపోతే న్యూడ్ ఫొటోలు బంధువులకు పంపుతామని మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడికి సోమవారం వాట్సాప్ కాల్ వచ్చింది. గుర్తు తెలియని నంబరు నుంచి కాల్ చేసిన సైబర్ నేరగాడు తీసుకున్న లోన్‌ను చెల్లించకపోతే. న్యూడ్ ఫొటోలను బంధువులకు పంపుతామని ఉపాధ్యాయుడిని భయపెట్టాడు. అయితే తాను ఎలాంటి లోన్ తీసుకోలేదని ఆయన బదులిచ్చాడు. లోన్ తీసుకున్నారని, వెంటనే చెల్లించాలని, లేకుంటే న్యూడ్ ఫొటోలను బంధువులు, స్నేహితులకు పంపడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని వాట్సాప్ కాల్‌లో సదరు వ్యక్తి భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో ఉపాధ్యాయుడు వెంటనే బోథ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నంబరును ఎస్సై శ్రీసాయి బ్లాక్ చేయించి, సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా
ఉండాలని ఉపాధ్యాయుడికి సూచించారు.
గబ్బిలానికి షార్ట్ సర్క్యూట్
వేమనపల్లి: మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్ద సోమవారం గబ్బిలం షార్ట్‌సర్క్యూట్‌కు గురై మృత్యువాత పడింది. దీంతో ఎల్టీ లైన్ తీగలు తెగిపోగా, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంటలు లేచి ఫీజులు మాడిపోయాయి. ప్రాణహిత కాలనీతో పాటు పలు వాడలకు విద్యుత్ పరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై విద్యుత్‌లైన్‌పై ఉన్న గబ్బిలాన్ని తొలగించి, విద్యుత్ లైన్ సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
ముగిసిన వెబినార్


