బాలికపై లైంగికదాడి.. హత్య
బంధువులైన ఇద్దరు వ్యక్తుల ఘాతుకం వీడిన చిన్నారి మృతి కేసు మిస్టరీ వివరాలు వెల్లడించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్
దండేపల్లి: బాలిక అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు విషయం బయట పడుతుందని చంపి బావిలో పడేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(6) అదృశ్యం కావ డం, మూడు రోజుల తర్వాత వ్యవసాయ బావిలో శవమై తేలడం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దండేపల్లి పోలీసులు మిస్టరీని ఛేదించారు. బాలికపై ఆమెకు దగ్గరి బంధువులైన ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడి హత్య చేశారని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు. సోమవారం దండేపల్లి పోలీసుస్టేషన్ ఆవరణలో ఏసీపీ ప్రకాశ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. మండలంలోని నంబాల గ్రామానికి చెందిన శనిగారపు బాపు(52) భార్య ఆరేళ్ల క్రితం చనిపోయింది. కొడుకు, కూతురు ఇతడికి దూరంగా ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఉపారపు సతీష్(40)కు రెండేళ్ల క్రితం భార్యతో విడాకులయ్యాయి. ఇద్దరూ బ్యాండ్ పని చేస్తూ జీవిస్తున్నారు. ఒంటరిగా ఉంటున్న వీరు ఖాళీ సమయంలో సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసేవారు. కొద్ది రోజులుగా గ్రామానికి చెందిన బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకున్నారు. నవంబర్ 24న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఇద్దరు కలిసి నోరు మూసి పత్తి చేనులోకి ఎత్తుకెళ్లారు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి ఈ విషయం బయట చెబుతుందనే భయంతో గొంతు నులిమి హత్య చేశారని డీసీపీ తెలిపారు. ఆ తర్వాత వ్యవసాయ బావిలో పడేశారని పేర్కొన్నారు. పారిపోయే ప్రయత్నాల్లో భాగంగా మోటార్‌సైకిళ్లపై ద్వారక నుంచి మేదరిపేట వైపు వెళ్తుండగా సోమవారం పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులపై పోక్సో, అత్యాచార కేసు నమోదు చేశామని తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ఏసీపీ ప్రకాశ్ పర్యవేక్షణలో కేసును ఛేదించిన లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహాసీనొద్దీన్, లక్సెట్టిపేట ఎస్సై సురేష్, జన్నారం ఎస్సై అనూష, పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు.


