విద్యార్థిని దూషించిన టీచర్ సస్పెన్షన్
ఆదిలాబాద్‌టౌన్: గిరిజన విద్యార్థిని కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవెనగర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠాలు చెప్పకుండా ఇతర పనుల్లో నిమగ్నమైన హిందీ ఉపాధ్యాయుడు మహ్మద్ యూనుస్‌ను సిలబస్ వెనుకబడి ఉందని, పాఠాలు చెప్పాలని కోరాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు విద్యార్థిని కులం పేరుతో దూషించడంతో పాటు వారి కుటుంబ సభ్యులను అసభ్యపదజాలంతో దూషించాడు. విద్యార్థి తల్లిదండ్రులకు తెలుపడంతో తల్లిదండ్రులు అదేరోజు విషయాన్ని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకొచ్చారు. కాగా సోమవారం విద్యార్థిని దూషించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల నాయకులు పాఠశాలలో ఆందోళన చేపట్టారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రఘురమణ, ఆదిలాబాద్ అర్బన్ ఎంఈవో సోమయ్యలు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


