మున్సిపల్ కార్యాలయం ముట్టడి
చెన్నూర్: చెన్నూర్‌లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో సౌకర్యాలు కల్పించిన తర్వాతే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కూరగాయల వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు బొగే భారతి మాట్లాడుతూ 30ఏళ్లుగా జగన్నాథ ఆలయం ఎదుట వందలాది మంది చిరు వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. మరుగుదొడ్లు, కూరగాయల నిల్వ గదులు, తాగునీటి సౌకర్యాలు కల్పించకుండా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ బుధవారం నుంచి కూరగాయలు అక్కడే విక్రయించాలని అల్టీమేటం జారీ చేయడం బాధాకరమని అన్నారు. మహిళా వ్యాపారులని చూడకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వ్యాపారాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌వెంటకస్వామి ఈ విషయంపై స్పందించి వసతులు కల్పించి భవనాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూరగాయల వ్యాపారులు పాల్గొన్నారు.


