జత కలిసేనని..! | - | Sakshi
Sakshi News home page

జత కలిసేనని..!

Dec 2 2025 7:34 AM | Updated on Dec 2 2025 7:34 AM

జత కలిసేనని..!

జత కలిసేనని..!

జన్నారం అటవీ డివిజన్‌లో పులి సంచారం

తోడు కోసం వెతుకుతోందని అధికారుల అంచనా

కొనసాగుతున్న పర్యవేక్షణ

జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌లో పులి తోడు కోసం సంచరిస్తోందా..? ఆడ పులి కోసం అన్వేషణ సాగిస్తోందా..? జత కలిసేందుకు అనువైన సమయమిదేనా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గత కొన్ని రోజులుగా జన్నారం అడవుల్లో పులి మకాం వేసింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ఎప్పటికప్పుడు కదలికలను గుర్తిస్తున్నారు. జన్నారం డివిజన్‌లో పర్యటిస్తున్నది మగపులిగా గుర్తించారు. ఆడపులి జత కోసం అన్వేషిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇక్కడే మకాం వేస్తుందా..?

2012 ఏప్రిల్‌లో కవ్వాల్‌ అభయారణ్యాన్ని కవ్వాల్‌ టైగర్‌ జోన్‌గా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పులల రాకపోకలే తప్ప ఇక్కడ ఆవాసం ఉన్న దాఖలాలు లేవు. ఒకట్రెండు రోజులు మాత్రమే ఈ ప్రాంతంలో సంచరించి తిరిగి వెళ్లేవి. కానీ గత నెల 26న జన్నారం అటవీ డివిజన్‌లోని ఇందన్‌పల్లి రేంజ్‌ పరిధిలో ఆవుపై దాడి చేసి చంపింది. పరిశీలించిన అటవీశాఖ అధికారులు పులి దాడిగా గుర్తించి ట్రాక్‌ చేశారు. సీసీ కెమెరాలు అమర్చగా వాటిలో పులి చిక్కినట్లు తెలిసింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో పులి పాదముద్రలు గుర్తించి ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు అంచనాకు వచ్చారు. టైగర్‌జోన్‌లో టైగర్‌ తిరగడం అంత ప్రత్యేకత కాకున్నా సంవత్సర కాలంగా పులి రాక కోసం ఎదురు చూస్తున్న అటవీ అధికారులకు మాత్రం ఈ పులి ఆరు రోజులుగా ఇక్కడే మకాం వేయడం ప్రత్యేకతగా చెప్పవచ్చు.

ఆవాసం ఏర్పాటు చేసుకుంటే..

జన్నారం అటవీ డివిజన్‌ పులి ఆవాసాలకు అనువుగా ఉంది. గడ్డి మైదానాలతో వన్యప్రాణుల సంఖ్య పెరగడం, నీటిసౌకర్యం, దట్టమైన అడవులు పులికి ఆవాస యోగ్యంగా ఉంటాయి. ఆరు రోజులుగా మకాం వేసిన పులి ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయి. ఆడపులి తోడయితే కొన్ని రోజుల్లో పులి పిల్లలను కనే అవకాశం ఉంది. అనువైన ప్రదేశం ఉన్నందున ఇక్కడే మకాం వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అడవుల్లోకి పశువులు, మనుషులు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అలజడి తగ్గిస్తే పులి ఆవాసం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటుందని అంటున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

తోడు కోసమేనా..?

జన్నారం అడవుల్లో తిరుగుతున్న పులిని మగ పులిగా అధికారులు గుర్తించారు. ఆడ పులికి తోక చిన్నదిగా, పాదముద్ర 4 సెంటీమీటర్లు వెడల్పు ఉంటుంది. ప్రస్తుతం జన్నారంలో తిరుగుతున్న పులి పాదముద్ర 5 సెంటీమీటర్ల వెడల్పు, తోక పొడవుగా ఉండడంతో మగ పులిగా నిర్ధారణకు వచ్చారు. ఆడపులి తోడు కోసమే వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చంద్రపూర్‌ అటవీ ప్రాంతం నుంచి బేల మీదుగా జన్నారం అడవుల్లోకి వచ్చినట్లు పేర్కొంటున్నారు. గత నాలుగు నెలల క్రితం లక్సెట్టిపేట అడవుల్లో కనిపించింది ఆడపులి కావడంతో దాని తోడు కోసమే ఈ ప్రాంతానికి మగపులి వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రతీ శీతాకాలంలో పులులు సంతతి పెంచుకోవడం జరుగుతుందని, జనవరి వరకు మేటింగ్‌లో ఉంటాయని అధికారులు తెలిపారు. అందులో భాగంగానే ఈ మగపులి తోడు కోసం వెదుకుతూ ఈ ప్రాంతానికి చేరిందని పేర్కొంటున్నారు.

టైగర్‌ ట్రాకింగ్‌పై శిక్షణ

జన్నారం అటవీ సిబ్బందికి టైగర్‌ ట్రాకింగ్‌పై శిక్షణ ఇప్పిస్తున్నారు. కాగజ్‌నగర్‌కు చెందిన టైగర్‌ ట్రాకర్లతో నాలుగు రోజులు శిక్షణ ఇప్పించారు. పులి అడుగులు గుర్తించడం, ప్రత్యక్షంగా చూసే విధానం, కెమెరాలు ఏర్పాటు చేయడం, పులి మానిటరింగ్‌లో మెలకువలు నేర్పించారు. పులి జాడ ఎలా కనుగొనడం, జాగ్రత్తలు వివరించారు. పది రోజుల తర్వాత మరో నాలుగు రోజులు సైతం శిక్షణ ఇప్పించనున్నారు.

పులి(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement