రేపు మొదటి విడత ఉపసంహరణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గ్రామ పంచాయ తీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల పరిశీలన సోమవారం పూర్తయింది. అభ్యంతరాలను స్వీకరించగా.. మంగళవారం ఆర్డీవో ఆధ్వర్యంలో పరిష్కరించనున్నారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన వెంటనే మధ్యాహ్నం అభ్యర్థులను ఖరారు చేస్తూ గుర్తులు కేటాయించనున్నారు. సర్పంచ్ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొనగా.. ఒక్కో స్థానానికి ఐదు నుంచి ఎనిమిది మంది వ రకు నామినేషన్లు వచ్చాయి. దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లోని 90 గ్రామ పంచాయతీలకు గాను మూడు పంచాయతీల్లో నా మినేషన్లు దాఖాలు కాలేదు. దీంతో 87 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 90 సర్పంచ్ స్థానాలకు 408, 816వార్డు సభ్యుల స్థానాలకు 1,697 నామినేషన్లు వచ్చాయి. 816 వార్డులకు గాను 34 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడం, ఏకగ్రీవం కావడం వంటి కారణాలతో మిగతా 782 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యంతరాలు పెద్దగా రాకపోవడంతో వచ్చిన కొన్నింటి పరిష్కార ప్రక్రియ మంగళవారం త్వరగానే పూర్తి కానుంది. బుధవారం చాలా సంఖ్యలో నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
ముల్కల్లలో ఇసుక రీచ్ ప్రారంభం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల శివారు గోదావరి తీరంలో గనులు, భూగర్భ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ సోమవారం ప్రారంభమైంది. మైనింగ్ శాఖ ఏడీ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఇసుక ట్రాక్టర్ వద్ద టెంకాయ కొట్టి రీచ్‌ను మళ్లీ యధావిధిగా ప్రారంభించారు. ట్రాక్టర్ యజమానులు సంయమనంతో ఇసుక రవాణా చేయాలని, ముల్కల్ల ఇసుక రీచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


