ఎన్నికల నిబంధనలు పాటించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● అధికారులకు శిక్షణ
మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల్లో అధికారులు నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో 1, 2, 3 విడత స్టేజ్ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికలు, బ్యాలెట్ నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు, ఏర్పాట్లు పరిశీలన, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, పోలింగ్ రోజున అవసరమైన ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ, అధికారులు, సిబ్బందికి ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మాస్టర్ ట్రైనర్లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎన్నికల అధికారి, పంచాయతీ అధికారి వెంకటేశ్వరావు, నోడల్ అధికారి శంకర్, మాస్టర్ ట్రైనర్లు హరిప్రసాద్, మధు, అధికారులు పాల్గొన్నారు.


