చారిత్రక శిల్పాలు గుర్తింపు
ఖానాపూర్: మండలంలోని బావాపూర్ (ఆర్) తండా సమీపంలోని గోండుగూడలో హనుమాన్ ఆలయంలో క్రీస్తుశకం 12,13 శతాబ్దాలకు చెందిన మధ్యయుగ చారిత్రక శిల్పాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌కుమార్ తెలిపారు. ఆనాటి శైవ ఆలయంలో పెద్ద ద్వారతోరణాన్ని గుర్తించారు. దాని మధ్యలో ప్రధాన శైవ ఆచార్యుడు, ఇరువైపులా అర్థ పద్మాసనాలలో కూర్చొని ఉన్న ఇద్దరు శైవ గురువులు, వారి పరిచారక గణాల శిల్పాలు ఒక్కొక్క గడిలో కూర్చి పేర్చి లతలతో అలంకరించి అందంగా చెక్కారని తెలిపారు. ఇదే గుడిలో కాకతీయుల కాలంలోనే చెక్కబడిన వినాయకుడు, నంది, నాగ శిల్పం, బాణలింగం, విరిగిన స్తంభాలు అనాటి శిల్పకళకు ప్రాణం పోస్తున్నాయి. అదేవిధంగా సింగాపూర్ గోండుగూడలో ఉన్న హనుమాన్ ఆలయంలో కాకతీయుల కాలంలో చెక్కబడిన గణపతి, లింగం, పానవట్టం, తదితర శిల్పాలు సంపూరక స్తంభాలు, ఇతర ఆధునిక శిల్పాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి ప్రాచీన శిల్పాలు ఇప్పుడు మనుగడలో లేని రెండు లింగాల గుడి నుంచే గ్రహించి పునఃప్రతిష్ట చేసినట్టు భావిస్తున్నారు. పరిశోధనలో యువ పరిశోధకులు రాజశేఖర్, బావాపూర్ గ్రామస్తులు పవన్, రాజేశ్వర్ పాలుపంచుకున్నారు.
గుర్తించిన ద్వార తోరణం
నంది విగ్రహం
చారిత్రక శిల్పాలు గుర్తింపు


