జనవరిలో తెలుగు మహాసభలు
నిర్మల్‌ఖిల్లా: ప్రపంచ మూడో తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5వ తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కవులు, సాహితీవేత్తలు, కళాకారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో తెలుగు మహాసభల ఆహ్వాన, కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. నిర్మలభారతి సాహితీ సాంస్కృతిక కళాక్షేత్రం జిల్లా ప్రధాన కార్యదర్శి, పద్యకవి బి.వెంకట్ తదితరులు కలిసి ఆవిష్కరించారు. ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతిలో సభలు జరుగుతాయని తెలిపారు. తెలుగు సాహిత్య సభలు, తెలుగు కవి సమ్మేళనాలు, అష్టావదానాలు, శతావధానాలు, తెలుగు కవి సమ్మేళనాలు, తెలుగుసాహిత్య సమీక్షలు, హరికథలు, బుర్రకథలు, పద్య, సాంఘిక నాటకాలు, జానపద, శాసీ్త్రయ నృత్యాలు, హాస్యవల్లరి, హాస్యకదంబం, గ్రంథావిష్కరణలు, సాహితీ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. జిల్లాకు చెందిన సాహితీవేత్తలు నేరెళ్ల హన్మంతు, పత్తి శివప్రసాద్, అంబటి నారాయణ, పోలీస్ భీమేశ్, కొండూరి పోతన్న, కడారి దశరథ్, శశికుమార్, గంగన్న, బస్వరాజు, చెనిగారపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


