‘డంపు’.. కంపు | - | Sakshi
Sakshi News home page

‘డంపు’.. కంపు

Dec 1 2025 7:22 AM | Updated on Dec 1 2025 7:22 AM

‘డంపు’.. కంపు

‘డంపు’.. కంపు

ఏళ్లుగా డీఆర్సీ కేంద్రంలోనే పోస్తున్న చెత్త

దుర్గంధంతో కాలనీవాసుల కష్టాలు

నగరానికి శాశ్వత డంప్‌యార్డు ఎక్కడా?

నస్పూర్‌లోని సింగరేణి స్థలం గుర్తింపు

కార్పొరేషన్‌కు అప్పగింతలో అడ్డంకులు

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌కు శాశ్వత డంప్‌యార్డు కోసం స్థల సేకరణలో జాప్యం జరుగుతోంది. మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాలను నస్పూర్‌ మున్సిపాలిటీ, హాజీపూర్‌ మండలంలోని ఎనిమిది గ్రామాలను విలీనం చేస్తూ ఈ ఏడాది జనవరిలో కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. దీంతో పరిధి పెరగడంతో పాటు రోజువారీ చెత్త సేకరణ కూడా పెరిగింది. చెత్త వేసేందుకు మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాలిటీలకు శాశ్వత డంప్‌యార్డులు లేక ఇబ్బంది అవుతోంది. నగరంలోని ఆండాళమ్మ కాలనీలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసేందుకు గాను రెండెకరాల్లో ఏర్పాటు చేసిన డీఆర్సీ కేంద్రాన్ని డంప్‌యార్డుగా మార్చి కొన్నేళ్లుగా వినియోగిస్తున్నారు. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో డంప్‌యార్డును తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించడం లేదు. ప్రస్తుతం వినియోగిస్తున్న డంప్‌యార్డుకు తక్కువ స్థలం ఉండడంతో చెత్తతో నిండి దుర్గంధం వ్యాపిస్తోంది. కాలుతున్న చెత్త నుంచి వస్తున్న పొగతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీరోజు 40 మెట్రిక్‌ టన్నులకు పైగా చెత్త వేస్తుండడం, తడి, పొడి చెత్తను వేరు చేయక పోవడంతో డంప్‌యార్డు పూర్తిగా నిండిపోతోంది. ఇటీవల బయోమైనింగ్‌ ప్రక్రియతో కొంత తొలగించినా రోజువారీగా చెత్త వేస్తుండడంతో డంప్‌యార్డు స్థలం నిండిపోతోంది.

పొగతో కాలనీవాసుల కష్టాలు

ఆండాళమ్మ కాలనీలోని డంప్‌యార్డులోని చెత్త కాల్చడంతో వచ్చే పొగను పీల్చడంతో పాటు దుర్గంధం కారణంగా కాలనీవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. డంప్‌యార్డుకు సమీపంలోనే అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండడంతో చిన్నారులకూ ఇబ్బందులు తప్పడంలేదు. డంప్‌యార్డును ఆనుకుని ఆండాళమ్మ కాలనీ ఏర్పడగా, గ్రీన్‌సిటీ, రంగంపేట్‌, పవర్‌ సిటీ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగి వందలాది కుటుంబాలవారు నివసిస్తున్నారు. చలికాలం కావడంతో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు చెత్త కాల్చడంతో వచ్చే పొగతో మరింత ఇబ్బంది పడుతున్నారు. డంప్‌యార్డు కోసం ఊరికి దూరంగా శాశ్వత స్థలాన్ని పలుసార్లు అధికారులు గుర్తిస్తున్నా, ఏదో ఓ కారణంతో ఆయా స్థలాలను వినియోగించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం నస్పూరులోని సింగరేణికి చెందిన స్థలాన్ని గుర్తించి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి అనుమతులు తీసుకున్నా డంప్‌యార్డును అక్కడికి తరలించడంలో జాప్యం జరుగుతోంది. గతంలోనూ వేంపల్లి, ముల్కల్ల, తిమ్మాపూర్‌లో డంప్‌యార్డుకు స్థలాలు సేకరించినా వాటిని వినియోగించక ముందే స్థానికులు అడ్డుకున్నారు. ప్రస్తుతం నస్పూరులోనూ స్థలాన్ని గుర్తించినా మంచిర్యాల కార్పొరేషన్‌కు దానిని అప్పగించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శాశ్వత డంప్‌యార్డుకు స్థలాన్ని కేటాయించడంలో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆండాళమ్మ కాలనీ, పవర్‌సిటీ కాలనీ, రంగంపేట, గ్రీన్‌సిటీ కాలనీల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement