మొదటివిడత నామినేషన్ల పరిశీలన పూర్తి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మొదటివిడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ పరిశీలన ప్రక్రియ ఆదివారం పూర్తయింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు దాఖలైన నామినేషన్ పత్రాలను కుణ్ణంగా పరిశీలించారు. చివరిరోజు భారీగా నామినేషన్లు రావడంతో 90 పంచాయతీలకు 408 నామినేషన్లు, 816 వార్డు సభ్యుల స్థానాలకు 1,697 నామినేషన్లు వచ్చాయి. అయితే, ఆయా మండలాల్లో రాత్రి వరకు కూడా నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగింది. పలు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు వివిధ కారణాలతో రిజెక్ట్ కాగా, కొందరు బాధితులు అప్పీల్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆమోదించిన నామినేషన్లపై సోమవారం అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ అభ్యంతరాలను మంగళవారం పరిశీలించి పరిష్కరిస్తారు. 3న మధ్యాహ్నం 3వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు.
బుజ్జగింపులు.. బేరసారాలు..
సర్పంచ్‌గా నామినేషన్ వేసినవారిలోని ప్రధాన పా ర్టీల ముఖ్య నేతలు తమ పట్టు నిలుపుకొనేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. కొన్నిచోట్ల పోటీగా నామినేషన్ వేసినవారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. వారి నామినేషన్ ఉపసంహరించుకునేలా బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 3న మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ఉండటంతో సర్పంచ్‌గా ఎలాగైనా గెలువా లనుకునేవారు ఎదుటివారిని తప్పించే యత్నాలు ప్రారంభించారు. ఒక్కో పంచాయతీకి ఒక్కొక్కరే బరిలో నిలిచి ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. గుర్తులు ఇంకా రాకు న్నా వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక కొంతమంది అభ్యర్థులు ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీ చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.


