● ముగిసిన తొలి విడత దాఖలు ● భారీ సంఖ్యలో అభ్యర్థులు రావ
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/జన్నారం/దండేపల్లి: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి నామినేషన్ల ఘట్టం ముగిసింది. గత రెండ్రోజులుగా సాగిన దాఖలు ప్రక్రియ శనివారంతో పూర్తయింది. చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలి రావడంతో వేచి చూడాల్సి వచ్చింది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసుకుని మరీ నామినేషన్ల దాఖలుకు మందీమార్బలంతో పోటాపోటీగా తరలివచ్చారు. నామినేషన్ల స్వీకరణ గడువు సాయంత్రం 5గంటల వరకే ఉండగా.. అప్పటికే వచ్చిన వారంతా వరుసలో ఉన్నారు. దీంతో సమయంలోపు వచ్చి వారందరికీ టోకెన్లు ఇచ్చి నామినేషన్లు స్వీకరించారు. టోకెన్లు తీసుకున్న వారంతా రాత్రి వరకు వేచి ఉండి నామినేషన్లు అందజేశారు. రాత్రయినా నామినేషన్ల స్వీకరణ పూర్తి కాకపోవడంతో ఎన్ని దాఖలయ్యాయనే లెక్క తేలలేదు. దండేపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో వార్డు స్థానాలకు అభ్యర్థులు కరువయ్యారు. దీంతో అప్పటికప్పుడు అభ్యర్థులను వెతికి నామినేషన్ వేయించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు హాజీపూర్, లక్సెట్టిపేట, జన్నారం, దండేపల్లి మండలాల్లో డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. 1,28,694 మంది ఓటర్లు ఉండగా.. 62,778 మంది పురుషులు, 65,913 మంది మహిళలు, ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నారు.
నేడు పరిశీలన..
సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామి నేషన్లను అధికారులు ఆదివారం పరిశీలిస్తారు. అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు.
ఎన్నికల అధికారుల పర్యవేక్షణ
హాజీపూర్ మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రానికి పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకుడు మనోహర్, ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజేశ్వర్ సందర్శించారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియను పర్యవేక్షించారు. డీపీఓ వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీఓ వెంకటరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే, సీఐ అశోక్ పాల్గొన్నారు.
● ముగిసిన తొలి విడత దాఖలు ● భారీ సంఖ్యలో అభ్యర్థులు రావ


