‘ఎన్‌హెచ్’లో కదలిక
జాతీయ రహదారి–63పై కేంద్రం దృష్టి
వచ్చే ఫిబ్రవరి వరకు పనులకు అవకాశం
పలు కేసుల్లో హైకోర్టులో స్టే కొనసాగింపు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జాతీయ రహదారి–63 పనులు ఓ వైపు హైకోర్టు కేసులతో జాప్యం జరుగుతుండగా.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. గత ఏడాదిన్నరకు పైగా నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్ ఓపెన్ చేయకనే జాప్యం జరిగింది. తాజాగా డిసెంబర్ వరకు గడువు ఉండడంతో పలువురు కాంట్రాక్టర్లు బిడ్ వేశారు. తుదిగా వచ్చే నెలలో బిడ్ ఓపెన్ చేయనుండగా.. ఫిబ్రవరిలో పనులు ప్రారంభించాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే భూసేకరణతోపాటు అలైన్‌మెంటు మార్పు కోరుతూ ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మొదట ఈ రహదారి పనులపై కేంద్ర ప్రభుత్వం సైతం ప్రాధాన్యత జాబితాలో లేకపోవడంతోనూ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. తాజాగా రాష్ట్రం నుంచి పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు ఆ మేరకు భూసేకరణ, చెల్లింపులు చేసేందుకు తదితరవన్నీ పూర్తవుతున్నాయి. ఇప్పటికే హాజీపూర్ మండలం పోచంపాడ్, వేంపల్లిలో దాదాపు 20 ఎకరాలకు పైగా సుమారు రూ.4కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. మిగతా చోట్ల కూడా భూసేకరణలో పరిహారం చెల్లింపులు జరిగితే పనులు సాగనున్నాయి. ఈ రోడ్డు కోసం జిల్లాలో మొత్తంగా 378 ఎకరాల వరకు సేకరించాల్సి ఉంది.
రైతుల ఆందోళన
జిల్లా పరిధిలో ప్రస్తుత కార్పొరేషన్ పరిధి హాజీపూర్ మండలం ముల్కల్ల నుంచి మందమర్రి మండలం క్యాతనపల్లి శివారు కుర్మపల్లి క్రాస్ వరకు బైపాస్ రోడ్డు అలైన్‌మెంటు ఉంది. మొత్తంగా జిల్లా పరిధిలో 33కిలోమీటర్ల నిడివి చూస్తే లక్సెట్టిపేట మండలం నుంచి లక్సెట్టిపేట, మోదెల, ఇట్కాల, పోతేపల్లి, గుల్లకోట, మిట్టపల్లి, కర్ణమామిడి, హాజీపూర్, పడ్తానపల్లి, నర్సింగాపూర్, గుడిపేట, ముల్కల్ల, వేంపల్లి, మంచిర్యాల, తిమ్మాపూర్, క్యాతనపల్లి గుండా రోడ్డు వెళ్తోంది. మొదట ప్రణాళిక ప్రకారం బెపాస్ అలైన్‌మెంటు మార్చడం పట్ల నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. తమ పంట పొలాల నుంచి వెళ్లొద్దంటూ నిరసనలు చేపట్టారు. ఇప్పటికీ అలైన్‌మెంటు మార్చుతారా? అనే ఆశతో ఉన్నారు. అయితే ఎన్‌హెచ్‌ఏఐ తుదిగా డిజైన్ ఖరారు చేయడంతో ఇక మార్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఎన్‌హెచ్–63 పనులు మొదలు కానున్నాయి. ఇక క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. దీంతో తమకు సరైన పరిహారం పొందుతామా? లేదా? అని న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు.


