లింగయ్యపల్లి ఏకగ్రీవం!
● సర్పంచ్, 10 వార్డు స్థానాలు ● అన్నింటికీ ఒక్కో నామినేషన్
జన్నారం: మండలంలోని లింగయ్యపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు శనివారం వరకు ఒక్కటే నా మినేషన్ దాఖలైంది. పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి నూతనంగా లింగయ్యపల్లి ఏర్పడింది. 1300 మంది జనాభా ఉండగా.. 684మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ స్థానానికి రెండో పర్యాయం ఎన్నిక జరుగుతుండగా.. ఈసారి బీసీ మహిళకు రిజర్వు అయింది. కొత్తపల్లి వనిత సర్పంచ్ అభ్యర్థిగా ఒక్కరే నామినేషన్ వేశారు. అదే విధంగా పది వార్డులకూ ఒక్కొక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే కానుంది. కాగా, వనిత భర్త శ్రీనివాస్ గత పదేళ్లుగా గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా ఉన్నాడు. పూజారిగా ఉచితంగా సేవలందిస్తానని, సర్పంచ్ స్థానానికి అవకాశం కల్పించాలని కోరడంతో గ్రామస్తులంతా అంగీకరించినట్లు తెలిసింది.
లోతొర్రే గ్రామంలోనూ..
జన్నారం: మండలంలోని లోతొర్రే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం కానుంది. సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది. సర్పంచ్ అభ్యర్థిగా బోడ శంకర్ ఒక్కరే నామినేషన్ వేశారు. 8 వార్డు స భ్యులకు 8 మంది మాత్రమే నామినేషన్ వేశా రు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నిక ఏకగ్రీవంపై ఎన్నికల అధికారి ప్రకటించాల్సి ఉంది.
రాపల్లిలో వార్డు సభ్యురాలు..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లి గ్రామ పంచాయతీ 8వ వార్డు సభ్యురాలుగా స్వాతి ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. ఒకే నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
లింగయ్యపల్లి ఏకగ్రీవం!


