జన్నారం అటవీ డివిజన్‌లో పులి గాండ్రింపు
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ పులి గాండ్రిస్తోంది. గత నాలుగు రోజులుగా అడవిలో పులి కదలికలు కనిపిస్తున్నాయి. రెండ్రోజులు గా ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌లో పర్యటిస్తూ చంపిన ఆవు మాంసాన్ని తిన్నట్లు అధికారులు గుర్తించారు. మూడో రోజు వేరే ప్రాంతంలో పులి అడుగులు కనిపించాయి. శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో జన్నారం డివిజన్‌లోని ఓ ప్రాంతానికి పులి పర్యవేక్షణకు వెళ్లిన సిబ్బంది నేరుగా పులి గాండ్రింపులు విన్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. 15సార్లు గాండ్రించిందని, భయంతో పరుగులు తీశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పులి ఉన్న చోట నుంచి రెండు కిలోమీటర్ల చుట్టూ మూత్ర విసర్జన చేస్తుంటుందని తెలిసింది. ఆ వాసన ఆధారంగా పులి సంచారాన్ని అధికారులు ధ్రువీకరిస్తారని సమాచారం. అటవీ ప్రాంతంలో పర్యటించిన పలువురు వ్యక్తులతోపాటుగా అటవీ అధికారులు అలాంటి వాసన గమనించినట్లు తెలిపారు. వీటన్నింటి ఆధారంగా పులి ఈ ప్రాంతంలోనే పర్యటిస్తున్నట్లు నిర్ధారణకు వస్తున్నారు. కదలికలపై అప్రమత్తంగా ఉంటున్నారు.


