ఈ మూడు గ్రామాల్లో ఎన్నికల్లేవ్?
దండేపల్లి: పంచాయతీ ఎన్నికల వేళ మండలంలోని అన్ని గ్రామాలు సందడిగా మారగా.. గూడెం, నెల్కివెంకటాపూర్, వందుర్‌గూడ గ్రామాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. గూడెం గ్రామానికి సర్పంచ్ లేక 38 ఏళ్లవుతోంది. నెల్కివెంకటాపూర్ గ్రామంతోపాటు కొత్తగా ఏర్పాటైన వందుర్‌గూడ పంచాయతీకి గత 2019 పంచాయతీ ఎన్నికల్లో ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఈ రెండు గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. శుక్రవారం వరకు ఈ మూడు గ్రామాల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
గూడెం ఏజెన్సీ గ్రామం కానప్పటికీ..
గూడెం గ్రామంలో 2,140 మంది ఓటర్లున్నారు. ఇందులో గిరిజనులెవ్వరూ లేరు. అయినప్పటికీ ఈ గ్రామాన్ని ఏజెన్సీ గ్రామంగా గుర్తించారు. దీంతో గ్రామంలోని సర్పంచ్ పదవితో పాటు సగం వార్డు స్థానాలు ఎస్టీలకే రిజర్వ్ చేశారు. దీంతో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు స్థానాలకు పోటీ చేసేందుకు గ్రామంలో గిరిజనులెవరూ లేరు. 1987 నుంచి గూడెం పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో ఆ గ్రామానికి సర్పంచ్ లేక 38ఏళ్లు గడిచింది. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.
నెల్కివెంకటాపూర్, వందుర్‌గూడలోనూ..
కొత్త పంచాయతీల ఏర్పాటుకు ముందు వందుర్‌గూడ గ్రామం నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. వందుర్‌గూడను నెల్కివెంకటాపూర్ నుంచి విడదీసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే వందుర్‌గూడ పంచాయతీ ఏర్పాటును గ్రామస్తులు వ్యతిరేకించారు. తమ గ్రామాన్ని నెల్కివెంకటాపూర్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో పంచాయతీ ఎన్నికలు బహిష్కరించారు. వందుర్‌గూడను విడదీయడంతో నెల్కివెంకటాపూర్‌లో గ్రామంలో గిరిజనులెవరూ లేని పరిస్థితి ఏర్పడింది. నెల్కివెంకటాపూర్ గ్రామం కూడా ఏజెన్నీ గ్రామం కావడంతో ఇక్కడ గిరిజనులు లేని కారణంగా గత 2019 పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎస్టీ అభ్యర్థులు లేక నామినేషన్లు వేయలేదు. దీంతో అప్పటి పంచాయతీ ఎన్నిక నిలిచిపోయింది. ఈ రెండు గ్రామాల పంచాయితీ ఎటూ తేలక పోవడంతో, ఈసారి కూడా ఎన్నికలు జరగడం అనుమానమే.
ఈ మూడు గ్రామాల్లో ఎన్నికల్లేవ్?


