ఖాతాల కోసం అభ్యర్థుల పాట్లు
దండేపల్లి: పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు చూపేందుకు గతంలో ఉన్న సేవింగ్ బ్యాంక్ ఖాతాలు కాకుండా మళ్లీ కొత్తగా ఖాతా తీసుకోవాలని ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించింది. దీంతో చాలా మంది అభ్యర్థులు బ్యాంక్‌లు, పోస్టాఫీసులకు వెళ్లి కొత్తగా ఖాతాలు తెరుస్తున్నారు. బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్‌కు రూ.2వేలు కావడంతో చాలామంది పోస్టాఫీస్‌లో రూ.200తో ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. దండేపల్లి పోస్టాఫీస్ శుక్రవారం ఖాతాలు తెరిచేందుకు వచ్చినవారితో సందడిగా మారింది.
సర్పంచ్ పదవికి వేలం?
సారంగపూర్: మండలంలోని మహవీర్‌తండా గ్రా మపంచాయతీ సర్పంచ్ పదవికి శుక్రవారం వేలం నిర్వహించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. వేలం పాటలో మహవీర్‌తండాకు చెందిన ఓమహిళ తరఫున వారి కుటుంబీకులు పాల్గొని రూ.5.60లక్షలకు పదవి దక్కించుకున్నట్లు సమాచారం. మహవీర్‌తండా, దుర్గానగర్ ఈరెండు తండాలు ఒకే పంచాయతీ కాగా, వీటి పరిధిలో 500 మంది ఓటర్లున్నారు. ఈ తండా సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా దుర్గానగర్, మహవీర్‌తండాల ప్ర జలు సర్పంచ్ పదవి తమకంటే తమకేనంటూ పో టీకి దిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జామ్ గ్రామ సమీపంలో ఇరుగ్రామాల ప్రజలు పంచాయితీకి కూర్చున్నారు. సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా మహవీర్‌తండాకు చెందిన ఓ మహిళ సర్పంచ్ పదవిని రూ.5.60లక్షలకు దక్కించుకున్న ట్లు తెలిసింది. అయితే.. ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తి విరుద్ధమని, వీటిని ఎన్నికల సంఘం నిరోధించాల్సిన అవసరముందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


