మధుకర్ కేసులో నిందితులను అరెస్టు చేయాలి
మంచిర్యాలటౌన్: వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య కేసులో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీస్ యంత్రాంగం గతంలో నిందితులను అరెస్టు చేయడంలో జాప్యం చేయడం వల్ల హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, బీజేపీ న్యాయవాదుల వాదనలతో శుక్రవారం స్టే వెకేట్ చేసిందని తెలిపారు. మధుకర్ మరణానికి కారణమైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. గతంలో నిందితులను శిక్షిస్తామని హామీనిచ్చిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అదే నిందితులతో అధికారిక కార్యక్రమాలు చేపట్టి, వారికి బాసటగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పానుగంటి మధు, తిరుపతి, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.


