పల్లె వెలుగు.. ఎక్స్‌ప్రెస్‌ చార్జీ | - | Sakshi
Sakshi News home page

పల్లె వెలుగు.. ఎక్స్‌ప్రెస్‌ చార్జీ

Nov 29 2025 6:55 AM | Updated on Nov 29 2025 6:55 AM

పల్లె వెలుగు.. ఎక్స్‌ప్రెస్‌ చార్జీ

పల్లె వెలుగు.. ఎక్స్‌ప్రెస్‌ చార్జీ

● స్టేజీలు తక్కువ.. టికెట్‌ రుసుం ఎక్కువ ● నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ బస్సులు

మంచిర్యాలఅర్బన్‌: ఆర్టీసీ తీరు ఇటీవల కాలంలో వివాదాస్పదంగా మారుతోంది. పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్‌ బోర్డులు తగిలించి తిప్పడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎక్స్‌ప్రెస్‌ చార్జీ వసూలు చేయడంపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలు దూరప్రాంత మార్గాల్లో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు రద్దు చేయగా.. మరికొన్ని మార్గాల్లో పల్లెవెలుగు బస్సులకే ముందు భాగంలో ఎక్స్‌ప్రెస్‌ కలర్‌, బోర్డులతో తిప్పి అధిక చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. పల్లెవెలుగు బస్సులు ప్రతీ స్టేజీలో రెండు నిమిషాలు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లాలి. మార్గమధ్యంలో చెయ్యి ఎత్తిన చోట ఆపడం, కోరిన చోట దించడం చేస్తుంటారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యంగా, టికెట్‌ చార్జీ తక్కువగా ఉంటుంది. ఎక్స్‌ప్రెస్‌గా మార్చడం వల్ల చాలా స్టేజీల్లో నిలపకుండా వెళ్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు బస్సుల్లేక గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. పల్లెవెలుగు బస్సులతో పోల్చితే ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు ఎక్కువగా ఉంటాయి. బస్సు పక్కన చూస్తే పల్లెవెలుగు కనిపిస్తుంది. ఎవరైనా హడావుడిలో బస్సు ఎక్కితే అంతే సంగతులు. పల్లెవెలుగు బస్సు కదా అంటే ముందు చూడలేదా..? ఎక్స్‌ప్రెస్‌ అనే సమాధానం రావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. ఉదాహరణకు.. లక్సెట్టిపేట నుంచి మంచిర్యాలకు వచ్చే పల్లెవెలుగు(ఎక్స్‌ప్రెస్‌) బస్సు దొనబండ, హాజీపూర్‌ స్టేజీల్లో మాత్రమే నిలుపుతారు. పల్లె వెలుగు అనుకుని ఎక్కితే మార్గమధ్యంలో ఎక్కడ నిలిపినా చార్జీలు తడిసి మోపెడవుతాయి. మంచిర్యాల నుంచి హాజీపూర్‌కు పల్లెవెలుగుకు రూ.30 కాగా, ఎక్స్‌ప్రెస్‌కు రూ.40, లక్సెట్టిపేటకు రూ.30 టికెట్‌ చార్జీలు ఉండగా.. ఎక్స్‌ప్రెస్‌కు రూ.50 చార్జీలు వసూలు చేస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా..

ఏ బస్సు ఏ రూట్‌లో ఎక్కడికి వెళ్తుంది..? పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్‌ అనే వివరాలు, కిలోమీటర్లు, ఆదాయం పొందుపరిచే ఎస్‌ఆర్‌(స్టార్‌)లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. ఎస్‌ఆర్‌లో కచ్చితంగా రాసిన చోటుకు మాత్రమే బస్సు నడపాలి. బస్సు వివరాలు లేకుంటే రాకపోకలు సాగించిన సమయంలో ఏదైనా జరిగితే ఉద్యోగుల(డ్రైవర్‌, కండక్టర్‌)కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇదేంటని ప్రయాణికులు నిలదీస్తే అధికారులు తమకు తెలియదంటూ తప్పించుకునే వీలులేకపోలేదు. ఎస్‌ఆర్‌లో వివరాలు నమోదు చేయకుండా నోటిమాటగా వచ్చిన ఉద్యోగులకు అన్ని ఇబ్బందులు తప్పేలా లేవు.

లబోదిబోమంటున్న

ప్రయాణికులు

చెన్నూర్‌: మంచిర్యాల నుంచి సిరోంచ, కాళేశ్వరానికి రాకపోకలు సాగిస్తున్న ఆర్టీసీ బస్సు రెండు రంగులతో ప్రయాణికులను గందరగోళానికి గురి చేస్తోంది. ఓ వైపు పల్లెవెలుగు అని ఉండడంతో ఆర్డినరీ బస్సు అనుకుని ఎక్కితే ఎక్స్‌ప్రెస్‌ చార్జీ వేస్తుండడంతో ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల నుంచి చెన్నూర్‌కు పల్లెవెలుగు బస్సు చార్జీ రూ.50 ఉండగా ఎక్స్‌ప్రెస్‌కు రూ.70 ఉంది. మంచిర్యాల నుంచి చెన్నూర్‌ మీదుగా కాళేశ్వరం వెళ్లే బస్సుకు ముందు భాగంలో ఎక్స్‌ప్రెస్‌ కలర్‌ వేసి దోపిడీ చేస్తున్నారని ప్రయాణికులు సాగర్‌, రమేశ్‌ ఆరోపించారు. ఈ విషయమై ఆర్టీసీ డీఏం శ్రీనివాస్‌ను సంప్రదించగా.. ఎక్స్‌ప్రెస్‌ బస్సులు తక్కువగా ఉండడంతో కండీషన్‌ ఉన్న బస్సులకు ఎక్స్‌ప్రెస్‌ చార్జీ తీసుకుంటున్నామని తెలిపారు. కొత్త బస్సులు వచ్చిన తర్వాత ఎక్స్‌ప్రెస్‌లు నడిపిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement