ఊపందుకున్న నామినేషన్ల దాఖలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో నామినేషన్ల దాఖలు ఊపందుకుంది. దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లోని ఆయా క్లస్టర్లలో రెండో రోజు శుక్రవారం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం చివరి రోజు కావడంతో భారీగా దాఖలు చేసే అవకాశం ఉంది. మొదటి రోజు గురువారం సర్పంచ్ స్థానాలకు 25, రెండో రోజు శుక్రవారం 99 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తంగా నామినేషన్ల సంఖ్య 124కు చేరింది. ఇక వార్డు సభ్యుల స్థానాలకు మొదటి రోజు 14న రెండో రోజు 222 నామినేషన్లు వేశారు. వాటి సంఖ్య మొత్తంగా 236కు చేరింది. కాగా, ఆయా మండలాల్లోని 90 గ్రామ పంచాయతీలు, 816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు డిసెంబర్ 11న జరగనుండగా 1,28,694 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
సమయం పాటించాలి : కలెక్టర్
దండేపల్లి: నామినేషన్ల స్వీకరణలో సమయం కచ్చితంగా పాటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కొర్విచెల్మ, నెల్కివెంకటాపూర్, ద్వారక, మేదరిపేట, దండేపల్లిలో నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. ఎన్ని నామినేషన్లు వచ్చాయని ఆర్వోలను అడిగి తెలుసుకున్నారు. చివరి రోజు నామినేషన్లువేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఐదు గంటల్లోపు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి వరుస క్రమంలో నామినేషన్లు తీసుకోవాలని, సమయం దాటిన తర్వాత ఎవరినీ లోనికి అనుమతించొద్దని తెలిపారు. ద్వారక ఉన్నత పాఠశాల ఆవరణలో హాస్టల్ భవనం పనులను పరిశీలించారు. దండేపల్లిలో జీపీ భవనం అసంపూర్తిగా ఉండడంపై ఎంపీడీవో ప్రసాద్‌తో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేయించాలని సూచించారు.
పరిశీలించిన అదనపు కలెక్టర్
లక్సెట్టిపేట: మండలంలోని జెండావెంకటాపూర్, చందారం గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య శుక్రవారం పరిశీలించారు. అభ్యర్థుల పూర్తి వివరాలు పరిశీలించాలని, ఎలాంటి ఇబ్బందులున్నా తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్‌కుమార్, ఎంపీడీవో సరోజ పాల్గొన్నారు.
నామినేషన్ల వివరాలు...
మండలం గ్రామాలు నామినేషన్లు వార్డులు నామినేషన్లు
దండేపల్లి 31 34 278 68
హజీపూర్ 12 07 106 23
జన్నారం 29 34 272 96
లక్సెట్టిపేట 18 24 160 35
మొత్తం 90 99 816 222


