హాస్టల్‌లో అరకొరగా భోజనం
మంచిర్యాలఅర్బన్: అరకొర భోజనం సరిపోక అర్ధాకలితో అలమటిస్తున్నామని, వంటవాళ్లు సమయానికి రాకపోవడంతో తామే వంట చేసుకుంటున్నామని నగరంలోని సాయికుంట బీసీ సమీకృత వసతిగృహ విద్యార్థులు శుక్రవారం డీబీసీడీవో భాగ్యవతికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం ఆమె హాస్టల్ తనిఖీకి వెళ్లగా అల్పాహారం(అటుకులు) విద్యార్థులందరికీ అందకపోవడంతో వార్డెన్‌పై మండిపడ్డారు. అప్పటికప్పుడు అటుకుల టిఫిన్ తయారు చేయించి పెట్టగా విద్యార్థులు బడికి ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. గురువారం చికెన్‌తో భోజనం సరిపడా లేకపోవడంతో కోడిగుడ్లు వండి వడ్డించిన ఘటన మరవకముందే మరోసారి ఇలా చేయడమేంటని ప్రశ్నించారు. అక్కడే ఉన్న పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, ఏఐఎస్‌బీ కార్యదర్శి సన్నీగౌడ్ వార్డెన్, వసతిగృహ ఉద్యోగుల విధి నిర్వహణలో అలసత్వం, నిబంధనల ప్రకారం మెనూ అమలు చేయకపోవడంపై ఫిర్యాదు చేశారు.
నిర్వహణ అస్తవ్యస్తం
బీసీ సమీకృత(ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కలిపి) బాలుర వసతిగృహ పర్యవేక్షణ అస్తవ్యస్తంగా మారింది. 201 మంది విద్యార్థులు ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ముగ్గురు వార్డెన్లు, వాచ్‌మెన్, కామటీ, వంటమనిషి ఒక్కో హస్టల్‌కు ముగ్గురు చొప్పున 12 మంది విధులు నిర్వర్తించాలి. రెగ్యులర్ ఎస్టీ వసతిగృహ వార్డెన్ జన్నారం, వాచ్‌మెన్‌ను సిర్పూర్‌కు డిప్యూటేషన్ ఇచ్చారు. ఎస్టీ వసతిగృహం వంటమనిషి పనిచేస్తోంది. బీసీ వసతిగృహం నుంచి ఇద్దరు ఔట్ సోర్సింగ్ వంటకార్మికులు, వాచ్‌మెన్ ఉన్నారు. ఎస్సీ వార్డెన్ ఉన్నా సరుకులు, భోజనం నిర్వహణ బీసీ వార్డెన్ పెత్తనం సాగుతోంది. వార్డెన్ చెప్పినట్లుగా కూరగాయల నుంచి అరటిపండ్ల వరకు విద్యార్థులే కొనుగోలు చేసి తీసుకొస్తారని తెలుస్తోంది. ఇటీవల డీబీసీడీవో తనిఖీ సమయంలో రిజిష్టర్‌లో ఉద్యోగుల హాజరు ఏరోజుకారోజు లేకపోవడంపై చివాట్లు పెట్టారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కార్యాలయంలో ముగ్గురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు విధుల నిర్వహిస్తున్నారు. వసతిగృహాల్లో పనిచేసేందుకు తీసుకున్న ఉద్యోగులు కార్యాలయానికి పరిమితం కావడంపై భిన్నాభిప్రాయాలున్నాయి. బీసీ సమీకృత వసతిగృహనికి సర్దుబాటుకు అవకాశం లేకపోలేదు. డిప్యూటేషన్‌పై వెళ్లిన ఎస్టీ వసతిగృహం వార్డెన్, వాచ్‌మెన్‌లను వెనక్కి పిలిపిస్తే కొంత మేర సమస్య తీరనుంది.


