అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లు, పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ, ఫలితాలు వంటి ప్రతీ అంశంపై ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్, అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, నోడల్ అధికారి శంకర్‌తో కలిసి 2వ, 3వ విడత రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియపై ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అవసరమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. నామినేషన్లు పరిశీలించి అర్హులు, అనర్హుల జాబితాలో పూర్తి వివరాలతో రూపొందించాలని అన్నారు. ఎన్నికల గుర్తుల కేటాయింపులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు, అధికారులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన
లక్సెట్టిపేట: మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి తీసుకురావాలని తెలిపారు. సన్నరకానికి మద్దతు ధరతోపాటు బోనస్ రూ.500 వస్తాయని తెలిపారు.


