● నిబంధనల ప్రకారం 150 ● నాలుగేళ్లుగా వందతోనే సరి.. ● వచ
ప్రభుత్వ మెడికల్ కాలేజీ నూతన భవనం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వసతులు సమకూరుతున్నాయి. ఫలితంగా వచ్చే విద్యాసంవత్సరం సీట్ల సంఖ్య పెంపుపై ఆశలు నెలకొన్నాయి. 2022లో మెడికల్ కాలేజీకి అనుమతి రాగా.. అదే ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సీట్లు కేటాయించి భర్తీ చేశారు. కళాశాల భవనానికి అప్పటికి స్థలం కేటాయించకపోవడంతో జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ఉన్న మంచిర్యాల మార్కెట్ యార్డును తాత్కాలిక మెడికల్ కాలేజీగా మార్చారు. మూడేళ్లుగా అందులోనే నిర్వహిస్తున్నారు. జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) నిబంధల ప్రకారం ప్రతీ మెడికల్ కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తారు. మంచిర్యాల కాలేజీలో పూర్తి స్థాయిలో వసతులు లేవని మొదటి సంవత్సరంలో కేవలం 100 సీట్లు కేటాయించి.. గత నాలుగేళ్లుగా అవే సీట్ల భర్తీతో కొనసాగిస్తున్నారు. మార్కెట్ యార్డులోని కాలేజీలో ఇన్నాళ్లూ తరగతులు అరకొర వసతులతో నిర్వహించారు. ఇటీవల గుడిపేట్‌లో నూతనంగా రూ.216 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీ భవనం పనులు పూర్తి దశకు చేరాయి. దీంతో ప్రస్తుత కాలేజీలోని మూడు సంవత్సరాల విద్యార్థులను నూతన భవనంలోకి తరలించి అక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు.
ఆసుపత్రి భవనం, ఖాళీల భర్తీతోనే..
ప్రభుత్వ కాలేజీకి అనుబంధంగా మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మాతాశిశు ఆరోగ్యం కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడం, సరైన సదుపాయాలు లేకపోవడంతో కాలేజీ రోడ్డులో ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీ ఆవరణలోనే రూ.129.25 కోట్లతో 450 పడకల సామర్థ్యంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. ఇది పూర్తయ్యేందుకు మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉండగా.. పూర్తయితేనే ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు ఉన్నట్లుగా గుర్తిస్తారు. ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తి, కాలేజీలోని పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు 41మంది ఉండాల్సి ఉండగా.. 19మంది రెగ్యులర్, ఒకరు కాంట్రాక్టు పద్ధతిలో మొత్తంగా 20 మంది మాత్రమే ఉన్నారు. అసొసియేట్ ప్రొఫెసర్లు 51మందికి గాను ఇద్దరు రెగ్యులర్, ఒకరు కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తుండగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 141మందికి గాను 56మంది రెగ్యులర్, 11మంది కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారు. నూతన ఆస్పత్రి భవనం అందుబాటులోకి రావడంతోపాటు ఖాళీలను భర్తీ చేస్తేనే నిబంధనల మేరకు సీట్ల సంఖ్య పెంచేందుకు అవకాశం ఉంది.
ఖాళీల భర్తీకి నివేదించాం
గుడిపేట్‌లోని నూతన భవనంలో తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మెడికల్ కాలేజీలో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి, ఖాళీలను భర్తీ చేసేలా చూడాలని ఉన్నతాధికారులకు నివేదించాం. ఖాళీలను సీనియర్ రెసిడెంట్ల(ఎస్‌ఆర్)తో భర్తీ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. వచ్చే ఏడాదికి 150 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించేలా చూడాలని ఎన్‌ఎంసీని కోరతాం.
– డాక్టర్ ఎండీ.సులేమాన్,
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్
● నిబంధనల ప్రకారం 150 ● నాలుగేళ్లుగా వందతోనే సరి.. ● వచ


