చిన్నారులను ఆకట్టుకునేలా బడి
రంగుల చిత్రాలతో ముస్తాబు ప్రాథమిక పాఠశాలల్లో ఆటపాటలతో బోధన ఆట పరికరాలు, సామగ్రికి నిధులు మంజూరు ఇన్‌స్ట్రక్టర్లకు ఐదు రోజులు శిక్షణ
మంచిర్యాలఅర్బన్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ముస్తాబవుతున్నాయి. పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలు, వివిధ రకాల చిత్రాలు విద్యార్థులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో అధునాతన వసతులు సమకూరుతున్నాయి. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ ఏడాది నుంచే ప్రీప్రైమరీ విద్య ఐదేళ్లలోపు చిన్నారులకు బోధన సాగుతోంది. బోధనభ్యసన సామగ్రి సమగ్ర శిక్ష అధికారులు సమకూరుస్తున్నారు. ఆటపాటలతో బోధనకు సామగ్రి దోహదపడనుంది. బాలలకు ఏకరూప దుస్తులు అందించనున్నారు.
పూర్వ విద్యాబోధనకు నిధులు
జిల్లాలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ అమలవుతోంది. మూడు పీఎంశ్రీ ప్రీప్రైమరీ పాఠశాలలు(రూ.1.50లక్షలు) మినహాయిస్తే ఈ ఏడాది ప్రారంభమైన 31న స్కూళ్లలో ఒక్కోదాని కి రూ.1.70లక్షలు కేటాయించారు. గత ఏడాది ప్రారంభమైన 10 స్కూళ్లకు రూ.50వేల చొప్పున ఇచ్చారు. వీటితో సామగ్రి, బోధనభ్యాస సామగ్రి కొనుగోలు చేయనున్నారు. తరగతి గదుల గోడలపై రంగులతో కూడిన చిత్రాలు వేసే పనులు చకచకా సాగుతున్నాయి. రూ.20వేలతో చిన్నారులకు ఏకరూప దుస్తులు, స్టేషనరీ సమకూర్చాల్సి ఉంది. ఆటపాటలతో బోధనభ్యాసనకు ఆటపరికాలు వినియోగించాల్సి ఉంది. ఇందుకు అవసరమైన టెండర్‌ను పూర్తి చేయగా ఒకట్రెండు రోజుల్లో ఆటపరికరాలు, ఫర్నిచర్ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఆయా పాఠశాలల తరగతి గదులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. గతేడాది నుంచి ప్రారంభమైన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో సామగ్రి కొనుగోలు చేయగా ప్రస్తుతం కేటాయించిన రూ.50వేలతో గదులపై రంగుల చిత్రాలు వేసి చిన్నారులను ఆకర్షించనున్నారు. ఆయా పాఠశాలల్లో నియమించిన ఇన్‌స్ట్రక్టర్లకు ఈ నెల 25న శిక్షణ ప్రారంభించగా.. ఈ నెల 29వరకు కొనసాగుతుంది. రాష్ట్ర స్థాయిలో తర్ఫీదు పొందిన వారు ఆటపాటలతో బోధనపై శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులను పాఠశాలలకు ఆకర్షితులను చేయడం ఎలా..? కృత్యధార బోధన, ఆటపాటలతో బోధించడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.


