పులి కదలికలపై అప్రమత్తం
హరిత వనాల వెంట పయనం
వేమనపల్లి: రాజారం, ఒడ్డుగూడెం అడవుల్లో ఇటీవల పులి సంచారం కలకలం రేపుతోంది. రాజారం హరిత వనాల వెంట తిరిగిన పులి మత్తడి ఒర్రె ప్రాంతంలో నీళ్లు తాగేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. పులి ఇటీవల సంచరించిందా వారం రోజుల క్రితం తిరిగి వెళ్లిందా అనేది తెలియడం లేదు. మత్తడిఒర్రె, హరిత వనాల ఒర్రెల వెంట పులి పాదముద్రలు కనిపిస్తుండడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజుల క్రితమే అటవీ అధికారులకు విషయం తెలిసి పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పొరుగున ఉన్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల వైపు వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌కు పులి వచ్చినట్లు తేలడంతో కదలికలను గమనించేందుకు అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎఫ్‌డీవో రామ్మోహన్, రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ సిబ్బందితో కలిసి పులి పాదముద్రలను గుర్తించి ఆ వైపున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు సిబ్బందిని అప్రమత్తం చేశారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు, అటవీ సిబ్బంది పులి కదలికలపై పర్యవేక్షణ చేస్తున్నారు. బుధవారం ఆవును చంపిన పులి గురువారం కూడా ఆ ఆవు మాంసాన్ని తిన్నట్లు అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాలకు పులి చిక్కినప్పటికీ కదలికలు బయటకు వస్తే ప్రమాదం ఉన్నందున అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పులి సంచరిస్తున్నందున అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌డీవో రామ్మోహన్ సూచించారు. ఆవు యజమానికి పరిహారం అందేలా చూస్తామని తెలిపారు. సెక్షన్ అధికారులు రవి, హన్మంతరావు, హిటికాస్ సభ్యులు పాల్గొన్నారు.


