ఎన్నికల్లో బలమైన శక్తిగా నిలవాలి
జైపూర్/భీమారం: కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సమన్వయంతో కలిసిమెలిసి పని చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలమైన శక్తిగా నిలవాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. గురువారం ఆయన జైపూర్ మండలం దుబ్బపల్లి, భీమారం మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో మెజార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు దిశగా ప్రతీ కార్యకర్త పని చేయాలన్నారు. గెలుపు గుర్రాలను బరిలో నిలపాలని స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. సర్పంచు స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి వివరాలు సేకరించారు. భీమారం మండలంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారిని పిలిచి వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకున్నారు. గ్రామాల్లో పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా కృషి చేస్తామని అన్నారు. పంచాయతీల వారీగా సర్వే చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, జైపూర్ మండల అధ్యక్షుడు ఫయాజ్, నాయకులు గుడెల్లి శ్రీనివాస్‌రెడ్డి, చల్ల విశ్వంభర్‌రెడ్డి పాల్గొన్నారు.
బయటపడ్డ విభేదాలు
భీమారంలో జరిగిన సమావేశంలో రెండు వర్గాలు మధ్య ఉన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి. మంత్రి పర్యటన సందర్భంగా రెండు చోట్ల సమావేశానికి ఏర్పాట్లు చేశారు. మంత్రి భీమారంలోని ఆవిడం ఎక్స్‌రోడ్డు వద్దకు చేరుకున్న వెంటనే జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొడేటి రవి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై భీమారం గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇంతలోనే మంత్రి పీఏ రమణారావు సమావేశ మందిరానికి వచ్చి మరోచోట కూడా సమావేశం ఉందని చెప్పారు. దీంతో మంత్రి వివేక్ స్పందిస్తూ తన సమయం వృథా చేస్తారా అంటూ పొడేటి రవిపై మండిపడ్డారు. అభిప్రాయ సేకరణ మధ్యలోనే నిలిపివేసి మరోవర్గం నేత జిల్లా నాయకుడు చేకూర్తి సత్యనారాయణరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశం హాల్ వద్దకు వెళ్తాం పదా అంటూ మంత్రి కార్యకర్తలందరినీ అక్కడికి తీసుకెళ్లారు.


