హాస్టల్‌లో అమలు కాని మెనూ
మంచిర్యాలఅర్బన్: మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..? అంటే కోడిగుడ్డుకు బదులు సగం అరటిపండు.. సగం బిస్కట్‌లు ఇస్తున్నారని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి(డీబీసీడీవో) భాగ్యవతి ఎదుట విద్యార్థులు గోడు వెళ్లబోసుకున్నారు. బుధవారం రాత్రి స్థానిక బీసీ సమీకృత వసతిగృహం ఆకస్మిక తనిఖీలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. పాడైన అరటిపండ్లు తెస్తున్నారని, ఒక్కోసారి వెనకాల తినే వారికి రెండోసారి అన్నం వేసుకుంటే కూర ఉండదని, చాలీచాలని భోజనంతో సరిపెట్టుకుంటామని విద్యార్థులు వాపోయారు. వసతిగృహంలో చెప్పిన దానికంటే తక్కువ విద్యార్థులున్నా అందరికీ చికెన్‌తో భోజనం అందకుండా పోవడంపై వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్ పులుసు, మజ్జిగ లేకపోవడంపై తీవ్రంగా మందలించారు. అందుబాటులో కనీసం కూరగాయలు లేకపోవడం.. పచ్చడి కూడా లేదని చెప్పడంతో చలించిపోయిన ఆమె అప్పటికప్పుడు కోడిగుడ్లతో కూర చేయించి పిల్లలకు భోజనం పెట్టించారు. వాచ్‌మెన్ తరచూ గొడవలు చేయడం. వ్యవహరశైలిపై విద్యార్థులు దృష్టికి తీసుకువచ్చారు. వసతిగృహ వాచ్‌మెన్‌తోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన శ్రీహరిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


