కేసీఆర్ పోరాట ఫలితమే రాష్ట్రం ఏర్పాటు
నస్పూర్: కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. గురువారం నస్పూర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్నే మలుపు తిప్పిందని అన్నారు. కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధన ఉద్యమంలో పోరాడారని తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో చేపట్టే దీక్షా దివస్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, టీబీజీకేఎస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ యావత్ తెలంగాణను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ముందుకు సాగించారని అన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


