ఎన్నికల నియమావళి పాటించాలి
లక్సెట్టిపేట: గ్రామ సర్పంచ్ ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండలంలోని పోతపల్లి, గుల్లకోట, చందారం గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. నియమావళి ప్రకారం నామినేషన్లు స్వీకరించాలని, కేంద్రాల్లో అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇటిక్యాల గ్రామ సమీపంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలోని మార్చూరీ నిర్మాణాన్ని పరిశీలించారు. ఆర్డీవో శ్రీనివాస్‌రావు వెంకట్రావుపేట గ్రామంలోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్‌కుమార్, ఎంపీడీవో సరోజ అధికారులు పాల్గొన్నారు.


