నూతన ఆవిష్కరణలతో అభివృద్ధి
నస్పూర్: నూతన ఆవిష్కరణల ద్వారా వివిధ రంగాల్లో అభివృద్ధి సాద్యమవుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పట్టణ పరిధిలోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో నిర్వహించిన 53వ జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, జిల్లా స్థాయి ఇన్స్‌పైర్ అవార్డుల ప్రదర్శన కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మనం చేసే ప్రతీ ప్రయత్నం దేశ అభివృద్ధికి దోహదపడాలని పేర్కొన్నారు. సైన్స్ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతోందని, విద్యార్థులను సాంకేతికత వైపు దృష్టి సారించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాగా ఈ ప్రదర్శనకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 మంది విద్యార్థులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ యాదయ్య, నస్పూర్ ఎంఈఓ పద్మజ, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్‌రావు, ఎంఈఓలు, ట్రస్మా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


