అంబేడ్కర్ ఆశయసాధనకు పాటుపడాలి
బాసర: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. బుధవారం బాసర ట్రిపుల్ ఐటీలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో డాక్టర్ రేవల్లి అజయ్ అధ్యక్షతన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ మూల సూత్రాలు, ప్రవేశిక, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులు, వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి తీసుకున్న అంశాల గురించి వివరించారు. ప్రజలందరూ రాజ్యాంగ ఫలాలను అందుకోవాలన్నారు. ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న పార్లమెంటరీ కమిటీలో బాబు రాజేంద్రప్రసాద్ ప్రవేశపెట్టగా ఆమోదం ముద్ర వేశారన్నారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌వో డాక్టర్ రాజేశ్, అసోసియేట్ డీన్లు డాక్టర్ విఠల్, డాక్టర్ మహేష్, ఎస్.శేఖర్, డాక్టర్ జి.నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


