ఆర్‌కే ఓసీ ఫేజ్–2 మందమర్రి ఏరియాకే కీలకం
రామకృష్ణాపూర్: త్వరలో ప్రారంభంకానున్న రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ ఫేజ్–2 గని మందమర్రి ఏరియాకే కీలకం కానుందని జీఎం రాధాకృష్ణ అన్నారు. ఓసీ ప్రాజెక్ట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు కానున్న ఓసీ ఫేజ్–2తో మళ్లీ ఈ ప్రాంతానికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్ 3న ప్రజాభిప్రాయసేకరణ ఉంటుందని స్థానిక ప్రజలు, ఆయా సంఘాల నాయకులు తమ అభిప్రాయాలు వెలువరించాలన్నారు. ఓసీ రాకతో ఏ ఒక్క గ్రామానికి కూడా ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఓసీ వస్తే డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులు వస్తాయని ఆ నిధులు పట్టణ అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. గతంలో మూతబడిన ఆర్‌కే 4, ఆర్‌కే 3, ఆర్‌కే 2, ఆర్‌కే 1ఏ గనులను కలుపుకుని ఓసీ ఏర్పాటవుతుందన్నారు. స్థానికులకే జీవనోపాధి కల్పిస్తామన్నారు. దాదాపు 400 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అవసరమన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఓసీలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో ఎస్‌ఓ టు జీఎం జీఎల్.ప్రసాద్, డీజీఎం పర్సనల్ అశోక్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఎన్విరాన్‌మెంటల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి, సెక్యూరిటీ ఆఫీసర్ రవికుమార్, ఓసీ మేనేజర్ పంకజ్‌సింగ్ పాల్గొన్నారు.


