నిబంధనలు పాటించాలి
దండేపల్లి: సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సూచించారు. దండేపల్లి మండల కేంద్రంతోపాటు లింగాపూర్, నెల్కివెంకటాపూర్ గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తితో కలిసి బుధవారం ఆయన సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించి వద్ద వందమీటర్ల లోపు ఎవరినీ రానివ్వకూడదని, నామినేషన్ వేసే వ్యక్తితో ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతించాలని తెలిపారు. ఎంపీడీవో ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి శ్రీలత, జూనియన్ అసిస్టెంట్ అరుణ్ పాల్గొన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి
లక్సెట్టిపేట: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని డీసీపీ భాస్కర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలు శాంతియుతంగా ఎన్నికల్లో పాల్గొనేలా చూడాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎన్నికల నిర్వాహణపై అవగాహన కల్పించారు. ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు, రూరల్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌కుమార్, సీఐ రమణామూర్తి పాల్గొన్నారు.


