సింగరేణి పెట్రోల్‌బంక్‌లు
బెల్లంపల్లి: సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రిలో పెట్రోల్‌బంక్‌ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఆరు బంక్‌లు ఏర్పాటు చేయనుండగా.. వీటిలో రెండు బెల్లంపల్లి, మందమర్రిలో నిర్మించనున్నారు. బంక్‌ల ఏర్పాటు అంశం కొన్నాళ్ల క్రితం తెరపైకి వచ్చినా ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చింది. బెల్లంపల్లిలో బొగ్గు గనులు మూతపడి, సింగరేణి విభాగాల ఎత్తివేతతో జనసందడి తగ్గి, కార్మికులు కానరాక కళావిహీనంగా తయారైంది. ఈ క్రమంలో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన సింగరేణి బెల్లంపల్లిలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేయడం శుభపరిణామంగా చెబుతున్నారు. మరోవైపు ఏఆర్ పోలీసుహెడ్‌క్వార్టర్స్ ముందు, శాంతిఖని శివారులో ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో ఇప్పటికే సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే కంపెనీ తరఫున బంక్‌లు ఏర్పాటు చేయనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెల్లంపల్లిలో పాత సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం క్రాస్‌రోడ్డు చౌరస్తా(కంపెనీ క్వార్టర్స్ ముందు) పక్కన ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం పరిశీలించి ఆమోదించినట్లు తెలుస్తోంది. మందమర్రిలోని యాపల్ ఏరియాలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సింగరేణి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) సంయుక్త ఆధ్వర్యంలో బంక్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి బీపీసీఎల్‌తో సింగరేణి అధికారులు లీజు ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. త్వరలో స్థలాన్ని స్వాధీనం చేసి బంక్‌ల నిర్మాణ పనులు మొదలు పెట్టాలనే తలంపులో ఉన్నారు. మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లో త్వరలోనే పెట్రోల్ బంక్‌ల నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని సింగరేణి మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ తెలిపారు.


