మహిళల అభివృద్ధికి వడ్డీలేని రుణాలు
లక్సెట్టిపేట: మహిళల అభివృద్ధి కోసమే ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాల ఐకేపీ మహిళా సంఘాల సభ్యుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా వడ్డీ లేని రుణాలు, అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని తెలిపారు. మహిళల కోసం ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కోళ్ల పెంపకం, క్యాటరింగ్, డెయిరీఫార్మ్, ఇతర రంగాల్లో ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మహిళలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యమని, దండేపల్లి మండలంలో మహిళల నిర్వహణలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని 1,618 స్వయం సహాయక సంఘాలకు రూ.1.45కోట్ల వడ్డీలేని రుణాల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో కిషన్, తహసీల్దార్ దిలీప్‌కుమార్, ఎంపీడీవో సరోజ, నాయకులు శ్రీనివాస్, ఆరీఫ్, పింగిళి రమేష్, ఐకేపీ సభ్యులు పాల్గొన్నారు.


