ప్రజాహితమే పోలీసుల లక్ష్యం
వేమనపల్లి: ప్రజాహితం, ప్రజల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అ న్నారు. మండల కేంద్రంలోని మంగనపల్లి క్రాస్ రో డ్డు వద్ద ఉన్న గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల ఆవరణలో చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. మంచిర్యాలకు చెందిన పవన్ ఆప్టికల్, కంటి ఆసుపత్రి సౌజన్యంతో నేత్ర వైద్యుల పర్యవేక్షణలో 150 మంది వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. 64 మంది దృష్టి లోపంతో ఉన్నందున శస్త్రచికిత్స చేయించనున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన 150 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. హాస్టల్ ఆవరణలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నీల్వాయి, కోటపల్లి పోలీసులు పాల్గొన్నారు.


