పీజీ విద్యార్థుల ఫలితాలు తారుమారు
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో అధికారుల తప్పిదం వల్ల పీజీ(ఎంకాం) ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అకడమిక్ ఇయర్ నష్టపోవాల్సి వచ్చింది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. కళాశాలలోని ఎంకాం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 30మంది మూడో సెమిస్టర్ పూర్తి చేసి నాలుగో సెమిస్టర్ పరీక్షకు ఫీజు చెల్లించి మేలో నిర్వహించిన వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యారు. వార్షిక పరీక్షలో ఒకరు గైర్హాజరు కాగా 29మంది హాజరయ్యారు. పరీక్ష ఫీజు చెల్లించిన సమయంలో కళాశాల పరీక్ష విభాగం అధికారులు మ్యాపింగ్ నమోదు క్రమంలో ఫైనాన్షియల్ సర్వీస్ మేనేజ్‌మెంటు(ఎఫ్‌ఎస్‌ఎం) అనే సబ్జెక్టుకు బదులుగా హ్యూమన్ రీసెర్చ్ డెవలప్‌మెంటు(హెచ్‌ఆర్‌డీ) సబ్జెక్టును నమోదు చేశారు. హాల్‌టికెట్‌లో హెచ్‌ఆర్డీ పరీక్ష రావడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. ఈ విషయమై ప్రిన్సిపాల్, పరీక్షల విభాగం అధికారులను నిలదీశారు. పరీక్షకు హాజరైతే తర్వాత తాము చూసుకుంటామని నచ్చజెప్పడంతో విద్యార్థులు హాజరయ్యారు. అక్టోబర్‌లో విడుదలైన ఫలితాలను ఆన్‌లైన్‌లో పరిశీలించగా.. ఎఫ్‌ఎస్‌ఎం సబ్జెక్టు ఉండి 29మంది గైర్హాజరైనట్లు ఉంది. ఆబ్సెంట్‌తో ఫెయిలైనట్లు మెమోలో ఉండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. యూనివర్సిటీ, కళాశాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంవత్సరం, భవిష్యత్ నష్టపోయామని, సంబంధిత అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ మహాత్మా సంతోష్‌ను సంప్రదించగా.. పరీక్ష ఫలితాల్లో జరిగిన తప్పిదంపై యూనివర్సిటీ వారితో సంప్రదిస్తున్నానని, విద్యార్థులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.


