యువ రైతు ఆత్మహత్య
తాంసి: భారీ వర్షాల కారణంగా సరైన పంట దిగుబడి రాలేదని మనస్తాపం చెందిన ఓ యువ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన ఆదిలా బాద్ జిల్లా తలమడుగు మండలం డోర్లీ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జలారపు లింగన్న (22) తన తండ్రి పేరిట ఉన్న మూడెకరాల 30 గుంటల్లో ఈ వానాకాలం సీజన్‌లో పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కోసం బయట నుంచి దాదాపు రూ.3 లక్షల వరకు తీసుకొచ్చాడు. అయితే అతివృష్టి కారణంగా సరైన దిగుబడి రాలేదు. చేసిన అప్పు ఎలా తీర్చాలో అంటూ మదన పడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన లింగన్న ఈ నెల 23న రాత్రి ఇంటి బయట పురుగుల మందు తాగి స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తల్లి విమల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పెర్కొన్నారు.
భర్త వేధింపులు భరించలేక..
మంచిర్యాలక్రైం: భర్త, అత్తమామల వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కాలనీకి చెందిన మిట్టపల్లి ప్రియాంకకు మందమర్రి మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌తో 2014లో వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు రామ్, లక్ష్మణ్(9) ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రియాంకను భర్త, అత్తమామలు రమాదేవి, సత్యనారాయణ, మరిది ప్రదీప్ వేధించేవారు. ఈ నెల 9న ఆమెను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దీంతో ఎల్‌ఐసీ కాలనీలోని తల్లిగారింటి వద్దనే ఉంటోంది. అయినా వేధింపులు ఆగకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతికి కారణమైన భర్త, మరిది, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి అంకం ఓదమ్మ ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.
యువ రైతు ఆత్మహత్య


