లేబర్‌కోడ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమం
శ్రీరాంపూర్: కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నస్పూర్ కాలనీలోని ప్రెస్‌క్లబ్‌లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్, సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ఐఎన్‌టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు జట్టి శంకర్‌రావు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. శాశ్వత కార్మికులకు వేతనాల పెరుగుదల ఉండదని, కాంటాక్ట్ కార్మిక వ్యవస్థ మరింత పెరుగుతుందని, కార్మికుడు తమ డిమాండ్ల కోసం సమ్మె చేసే హక్కును కోల్పోతారని తెలిపారు. యూనియన్ల ఏర్పాటకు కూడా నిబంధనలు ఆటంకంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ సంఘాలు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమయ్యాయని, కార్మికులు కూడా ఈ ఆందోళనలో కలిసి రావాలని అన్నారు. జేఏసీ పిలుపులో భాగంగా మంగళవారం అన్ని గనులపై నిరసనలు చేపడుతామని తెలిపారు. 26న కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రాలు అందజేస్తామని, అదేరోజు సాయంత్రం జీఎం కార్యాలయాల వద్ద ధర్నా ఉంటుందని, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నా విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచీ కార్యదర్శి బాజీసైదా, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షులు గరిగే స్వామి, తిరుపతి రాజు, టీబీజీకేఎస్ నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్, వెంగళ కుమార్ స్వామి, సీఐటీయూ ఉపాధ్యక్షుడు సదానందం తదితరులు పాల్గొన్నారు.


