గల్ఫ్ బాధితుడి భార్యకు ఉద్యోగం
సోన్: ఇటీవల దుబాయిలోని ఓ బేకరీలో సహ ఉద్యోగి, పాకిస్తాన్‌కు చెందిన ఉన్మాది చేతిలో హత్యకు గురైన మండల కేంద్రానికి చెందిన అష్టం ప్రేమ్‌సాగర్ భార్య ప్రమీలకు మండలంలోని కూచన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రీప్రైమరీ టీచర్ ఉద్యోగం ఇచ్చినట్లు ఎంఈవో పరమేశ్వర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేసినట్లు పేర్కొన్నారు. ప్రేమ్‌సాగర్ భార్య గతంలో హైదరాబాద్‌లో గల్ఫ్ ప్రజావాణిలో తనకు న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిని కలిసి ఉద్యోగం ఇవ్వాలని వినతిపత్రం అందించింది. ఈ నేపథ్యంలో సీఎంవో చొరవతో ఫైల్ వేగంగా కదిలింది. ఈ క్రమంలో సోమవారం ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వెంటనే ప్రమీల ఉద్యోగంలో చేరారు.
ఏప్రిల్ 11న హత్య..
సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్ దుబాయ్‌లోని ఒక బేకరీలో ఉద్యోగం చేసేవాడు. సహోద్యోగి అయిన పాకిస్తాన్ ఉన్మాది ఏప్రిల్ 11న కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో ప్రేమ్‌సాగర్‌తోపాటు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్ మరణించారు.


