ఫిబ్రవరిలో ఇంటర్ పరీక్షలు
లక్ష్మణచాంద: ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు నిర్వహించనున్నా రు. ప్రయోగ పరీక్షలను ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు జరుపనున్నారు. ఇంగ్లిష్ ప్రయోగ పరీక్షలను ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల కు జనవరి 21న, రెండో సంవత్సరం విద్యార్థులకు 22న నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూ మన్ వాల్యూస్ పరీక్ష జనవరి 23న, పర్యావరణ విద్య జనవరి 24న నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్షల నేపథ్యంలో..
ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలు ఉండడంతో ఈసారి ముందుగానే ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. దీంతో మార్చిలో కాకుండా ఫిబ్రవరిలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇప్పటివరకు 75శాతం సిలబస్ పూర్తయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నాటికి 100 శాతం పూర్తి చేసి జనవరి మొదటి వారంలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. వార్షిక పరీక్షల కోసం ఇప్పటి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్లు అధ్యాపకులు తెలిపారు.
సీసీ కెమెరాల మధ్య ప్రయోగ పరీక్షలు..
ఈసారి ఇంటర్ ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డ్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలను సీసీ కెమెరాల మధ్య నిర్వహించాలని నిర్ణయించారు. సీసీ కె మెరాలు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు మాత్రమే ప్రయోగ పరీక్ష కేంద్రాలు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటికే జూనియర్ కళాశాలల్లో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు.
సన్నద్ధత ప్రారంభించాం
ఇంటర్ వార్షిక పరీక్షల కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాం. కళాశాలలో సాయంత్రం సమయంలో నిర్వహించే ప్రత్యేక స్టడీ అవర్స్‌లో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం.
– హారతి, ఇంటర్ విద్యార్థిని
అధ్యాపకుల పర్యవేక్షణలో..
ఇంటర్ వార్షిక పరీక్షల కోసం అధ్యాపకుల పర్యవేక్షణలో చదువుకుంటున్నాం. వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడమే లక్ష్యంగా కష్టపడుతున్నాం. – మహాలక్ష్మి, ఇంటర్ విద్యార్థిని
ప్రణాళికతో ముందుకు..
ఇంటర్ బోర్డు సూచనల మేరకు జూనియర్ కళాశాలల్లో చర్యలు చేపడుతున్నాం. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ఉన్నాయి. ఇప్పటికే 75శాతం సిలబస్ పూర్తయ్యింది. డిసెంబర్ చివరకు సిలబస్ పూర్తి చేస్తాం. విద్యార్థులను పరీక్షల కోసం సన్నద్ధం చేసేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. – పరశురాం నాయక్,
ఇంటర్ నోడల్ అధికారి, నిర్మల్
ఫిబ్రవరిలో ఇంటర్ పరీక్షలు
ఫిబ్రవరిలో ఇంటర్ పరీక్షలు
ఫిబ్రవరిలో ఇంటర్ పరీక్షలు


