రైల్వే సామగ్రి చోరీ.. నిందితులు అరెస్ట్
బెల్లంపల్లి: రైల్వే సామగ్రి దొంగతనం చేసిన నిందితులను బెల్లంపల్లి రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సిబ్బంది పట్టుకున్నారు. బెల్లంపల్లి ఆర్‌పీఎఫ్ ఏఎస్సై మోహన్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వేకు చెందిన చిన్నసైజ్ పట్టాలను బెల్లంపల్లిలో కొందరు యువకులు అపహరించుకు పోతున్నారని రామగుండం ఆర్‌పీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్‌కు గురువారం రాత్రి సమాచారం అందింది. సీఐ వెంటనే బెల్లంపల్లి సిబ్బందికి సమాచారం అందించి అప్రమత్తం చేశారు. కాల్‌టెక్స్ ఏరియా ప్రాంతంలో నిఘా పెట్టి తాండూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మోటం తిరుపతి, సీసీసీ నస్పూర్‌కు చెందిన కడమంచి సురేశ్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 45 చిన్నసైజ్ రైలు పట్టాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.27,660 వరకు ఉంటుందని అంచనా వేశారు. చెన్నూర్‌లో స్క్రాప్ షాప్ నిర్వహిస్తున్న కడారి శేఖర్ అనే వ్యక్తికి రైల్వే సామగ్రిని అమ్మకానికి తీసుకెళ్లే క్రమంలో నిందితులు పట్టుబడ్డారు. సామగ్రి తరలించడానికి వినియోగించిన మారుతి ఆల్టో కారును స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులతో పాటు కొనుగోలు దారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.


