పర్యవేక్షణేది..!
వరి ధాన్యం ఎటు పోతోంది..! రూ.కోటిన్నర మోసంతో వెలుగులోకి అక్రమాలు జిల్లా పౌరసరఫరాల శాఖలో బయటపడిన డొల్లతనం
కొనుగోళ్లపై
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం సేకరణలో కొన్ని చోట్ల గోల్‌మాల్ జరగడం జిల్లాలో కలకలం రేపుతోంది. విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకునే వరకూ గుర్తించకపోవడంలో ప్రధానంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది. తాజాగా జైపూర్ మండలంలో రూ.కో టిన్నర వరకు అక్రమాలు చోటు చేసుకోవడం పర్యవేక్షణలో డొల్లతనాన్ని బయటపెడుతోంది. జిల్లాలో ప్రతీ సీజన్‌లో వరి ధాన్యం సేకరణ లక్ష్యం పెరుగు తూ వస్తోంది. ఆయా సీజన్లలో ప్రభుత్వం కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపడుతోంది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐకేపీ, మెప్మా, డీసీఎంఎస్, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారు. కొన్ని చోట్ల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రాల నిర్వాహకులపైనా ఆరోపణలు రావడం, వారి స్థానంలో కొత్తవా రిని ఎంపిక చేయడం జరుగుతోంది. ఐకేపీ, మెప్మా కేంద్రాల కన్నా డీసీఎంఎస్, సహకార సంఘాల్లో అధికంగా అక్రమాలు జరుగుతున్నాయి. మంచిర్యా ల నియోజకవర్గంలో గత రెండు సీజన్లుగా కేవలం మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే కొనుగోళ్లు చేపడుతున్నారు. కేంద్రాలు అప్పగించడం మొదలు, మిల్లుల ట్యాగింగ్, రవాణా తదితర అన్నింటిలోనూ మోసాలకు ఆస్కారం ఉంది.
ప్రజాధనం పక్కదారి
పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర సరిహద్దు నుంచి లారీల కొద్దీ ధాన్యం జిల్లాకు అక్రమంగా వస్తోంది. ఇక్కడ కొందరు రాజకీయ పార్టీ నాయకులు, అధికారులతో కుమ్మకై ్క దొడ్డిదారిన వడ్లు తెచ్చి విక్రయిస్తున్నారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం అందిస్తున్న బోనస్ సైతం కాజేస్తున్నారు. మరికొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లు సహకరించుకుంటూ రైతులను ముంచేస్తున్నారు. తాలు, దుమ్ము, ధూళి, తేమ అంటూ తరుగు పేరుతో కటింగ్ పెడుతున్నారు. అధికంగా వచ్చిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. రైతు పంపిన బస్తాలకు, మిల్లు నుంచి వచ్చే రశీదుల మధ్య వ్యత్యాసం వస్తోంది. ఇక కొన్ని చోట్ల మిల్లర్లే రవాణా కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు సైతం వారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. దీంతో ధాన్యం సేకరణ నుంచి కొనుగోలు, రవాణా, మిల్లులకు అప్పగింత, సీఎంఆర్ కింద బియ్యం ఇచ్చే వరకు అంతా తమ అదుపులో ఉంటోంది. దీంతో ఎక్కడైనా ఈ అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోంది.
ఆన్‌లైన్‌లో నమోదు చేసినా..
కొనుగోలు కేంద్రాల్లో ప్రతీ గింజను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. వానాకాలం, యాసంగి వడ్ల కొనుగోళ్ల సమయంలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుని తతంగం నడిపిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖతోపాటు జిల్లా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా పర్యవేక్షణ చేపటాల్సిందిగా రైతులు కోరుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లు(ఫైల్)
జిల్లాలో ధాన్యం సేకరణ వివరాలు(విలువ మెట్రిక్ టన్నుల్లో)
సంవత్సరం ఖరీఫ్ రబీ
2017–18 31254.6 138147.3
2018–19 67044.3 156585.9
2019–20 119044.3 199856.2
2020–21 51765.9 222990.9
2021–22 137179.8 113080.3
2022–23 158336.8 186113.040
2023–24 139663.8 155067.7
2024–25 1.01లక్షలు 197590.9
2025–26 2.32లక్షలు(లక్ష్యం)


