క్రీడాకిట్లు మాయం..? | - | Sakshi
Sakshi News home page

క్రీడాకిట్లు మాయం..?

Nov 1 2025 8:14 AM | Updated on Nov 1 2025 8:14 AM

క్రీడ

క్రీడాకిట్లు మాయం..?

● గత ప్రభుత్వ హయాంలో పంపిణీ ● ప్రస్తుతం ఎక్కడా కనిపించని వైనం

మంచిర్యాలటౌన్‌: యువత క్రీడల్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, వార్డుల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఆటలు ఆడేలా సౌకర్యాలు కల్పించకపోయినా క్రీడాకిట్లు మాత్రం పంపిణీ చేసింది. మైదానానికి వచ్చేవారిలో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలు వెలికితీసేలా క్రీడాకిట్లు ఉపయోగపడుతాయని అంతా భావించారు. కానీ ప్రస్తుతం క్రీడాకిట్లు మాయం కావడంతో లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో పట్టణాలు, వార్డులు, గ్రామాల్లో 670 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాలు గుర్తించింది. ఆయా స్థలాలను చదును చేసి బోర్డులు ఏర్పాటు చేసి వదిలేశారు. ఒక్కో క్రీడా ప్రాంగణానికి పలు క్రీడల కిట్లు అందజేశారు. ఇందులో క్రికెట్‌ కిట్‌(రెండు బ్యాట్లు, బ్యాగింగ్‌ గ్లౌజులు రెండు జతలు, వికెట్‌ కీపింగ్‌ లెదర్‌ గ్లౌజులు ఒక జత, లెగ్‌ప్యాడ్లు రెండు జతలు, వికెట్‌ కీపింగ్‌ లెగ్‌గార్డు/ప్యాడ్‌ ఒక జత, స్టంప్స్‌ సెట్‌లు 2, అబ్డమినాల్‌ గార్డులు రెండు జతలు, ప్రాక్టిస్‌ బాల్స్‌ 6, ఆర్మ్‌గార్డ్‌ 2, థై ప్యాడ్లు 4, క్రికెట్‌ కిట్‌ బ్యాగ్‌ 1), జిమ్‌(డంబెల్స్‌ మూడుసెట్లు), వాలీబాల్‌ సెట్‌లో వాలీబాల్‌ సింథటిక్‌ 1, నెట్‌ 1, సైకిల్‌ పంప్‌ బిగ్‌ సైజ్‌(ఫుట్‌ పంప్‌1), ఆటవస్తువులకు కిట్‌ బ్యాగ్‌, 75 టీషర్టులు, స్కిప్పింగ్‌ రోప్‌ 4, ప్లాస్టిక్‌ విజిల్స్‌ 3, స్టాప్‌ అండ్‌ గో వాచ్‌ 1 చొప్పున ప్రతీ క్రీడా ప్రాంగణానికి అందజేశారు. పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో నమోదు చేసుకున్న యువజన సంఘాలకు కిట్లు అప్పగించగా, గ్రామీణ ప్రాంత కిట్లను ఎంపీడీవోలకు అందించారు. ఇందులో ఎన్ని కిట్లు యువతకు చేరాయి, ఎన్ని వినియోగంలో ఉన్నాయనే వివరాలు ప్రస్తుతం అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. రూ.లక్షలు వెచ్చించి అందించిన కిట్లు ప్రస్తుతం క్రీడల్లో శిక్షణ పొందాలనుకునే వారికి అందుబాటులో లేకపోవడంతో, స్వంతంగా కొనుగోలు చేసుకుని సాధన చేయాల్సి వస్తోంది. గతంలో ఇచ్చిన క్రీడా కిట్లు ఏమయ్యాయనే వివరాలు సేకరించి, ఉన్నవాటిని ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారికి అందిస్తే మేలు జరిగే అవకాశం ఉంది.

వివరాలు సేకరిస్తాం

జిల్లాలో క్రీడాకిట్ల పంపిణీ గతంలోనే చేపట్టారు. వాటిని యువతకు ఇస్తే ఎక్కడ వినియోగిస్తున్నారనే వివరాలు సేకరిస్తాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రీడాకిట్లు అందించగా, వాటిని యువత సద్వినియోగం చేసుకునేలా చూస్తాం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పలు క్రీడల్లో విద్యార్థులు, యువత రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్తున్నారు. ఆసక్తి ఉన్న వారికి మరింత ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తాం. – హన్మంతరెడ్డి,

జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి

క్రీడాకిట్లు మాయం..?1
1/1

క్రీడాకిట్లు మాయం..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement