బెల్లంపల్లిలో రోడ్డు విస్తరణ పనులు షురూ
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాల్టీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోడ్డు విస్తరణ పనులు ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమయ్యాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త ము న్సిపల్ కార్యాలయం ముందు నుంచి కాంటా చౌర స్తా వరకు పనులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపుల ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు జేసీబీలతో తొలగించి విస్తరణకు అడ్డుగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ధార్మిక, విద్యాసంస్థల ప్రహరీలను కూల్చివేశారు. ముందుగా ఎలాంటి అభ్యంతరాలు లేని కట్టడాలు తొలగించారు. శిథిలాలను మున్సిపల్ ట్రాక్టర్లలో డంప్‌యార్డుకు తరలించారు. సింగరేణి ఏరియా ఆస్పత్రి నుంచి కాంటా చౌరస్తా వరకు వంద ఫీట్ల రోడ్డును విస్తరించనుండడంతో అడ్డుగా ఉన్న కట్ట డాలను తొలగించే పనులు ముమ్మరం చేశారు. సింగరేణి ఆస్తులకు సంబంధించి ప్రహరీలు, సీఎస్‌ఐ చర్చి, క్యాంపు కార్యాలయం ఇతర ప్రాంతాల్లో కట డాలను రాత్రి వరకు కూల్చివేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. రూ.9.7కోట్ల అంచనాతో మున్సిపాల్టీలో ప్రతిపాదించిన రోడ్లను విస్తరించనున్నారు. మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ పర్యవేక్షణలో పనులు జరిగాయి. బెల్లంపల్లి ఏసీపీ ఎ.రవికుమార్ పర్యవేక్షణలో వన్‌టౌన్, బెల్లంపల్లి రూరల్, తాండూర్ సీఐలు కే.శ్రీనివాసరావు, హెచ్.హనోక్, ఎన్.దేవయ్య, పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
ప్రజాధనం వృథా
వీధి వ్యాపారుల కోసం ప్రధాన రహదారి మూసివేతకు గురైన సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ విభాగం ఎదుట మున్సిపల్ ఆధ్వర్యంలో షెడ్లు నిర్మించారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ షెడ్లలో వీధి, చిరు వ్యాపారులు చేపలు, పండ్లు, రెడీమేడ్ దుస్తుల అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రస్తుత విస్తరణలో షెడ్లు కూల్చివేతకు గురయ్యాయి. షెడ్లను ఆధారం చేసుకుని జీవనం సాగించిన చిరువ్యాపారులు వీధినపడ్డారు. షెడ్లు కూల్చివేతతో ప్రజాధనం వృథా అయిందని, అధికారుల అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి.


