అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీస్‌ ఖాళీ...! | - | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీస్‌ ఖాళీ...!

Oct 31 2025 8:06 AM | Updated on Oct 31 2025 8:06 AM

అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీస్‌ ఖాళీ...!

అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీస్‌ ఖాళీ...!

ఇన్‌చార్జి ఏఎల్‌వోతో నెట్టుకొస్తున్న వైనం జూనియర్‌ అసిస్టెంట్‌ ఒక్కరే దిక్కు భర్తీకి నోచుకోని ఆఫీస్‌ సబార్డినేట్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు సత్వరం పనులు జరగక కార్మికుల అవస్థలు

బెల్లంపల్లి: బెల్లంపల్లి అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి (ఏఎల్‌వో) కార్యాలయం అస్తవ్యస్తంగా తయారైంది. అసంఘటిత కార్మికవర్గానికి అందుబాటులో ఉండి సేవలు అందించడానికి రెగ్యులర్‌ అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏఎల్‌వో కార్యాలయంలో ఏడాదిన్నర నుంచి ఆఫీస్‌ సబార్డినేట్‌ (అటెండర్‌), అత్యంత అవసరమైన డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు భర్తీ కావడంలేదు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఏఎల్‌వో పాక సుకన్య మృతి చెందిన ఓ భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు కోసం గత జులై 18న తన వ్యక్తిగత సహాయకురాలు మోకెనపల్లి రాజేశ్వరి ద్వారా రూ.30 వేలు లంచం తీసుకుని ఏసీబీ అధికారుల చిక్కి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో మంచిర్యాల అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి సత్యనారాయణకు బెల్లంపల్లి ఇన్‌చార్జి ఏఎల్‌వో బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జూనియర్‌ అసిస్టెంట్‌ ఒక్కడే అన్నీ తానై విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఫైళ్లు కానరాక అయోమయం

అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఏఎల్‌వో పాక సుకన్య పట్టుబడక ముందు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహించిందనే విమర్శలు ఉన్నాయి. కొంతమందిని సహాయకులుగా నియమించుకుని ప్రతీపనికి లెక్కకట్టి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలోనే అనేక మంది అసంఘటిత కార్మికులు కార్యాలయంలో అందజేసిన ఫైళ్లను సుకన్య వ్యక్తిగతంగా తన వద్ద ఉంచుకుని ముడుపులు ముట్టజెప్పిన కార్మికుల ఫైళ్లను మాత్రమే క్లియర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. మిగతా కార్మికుల పైళ్లను పెండింగ్‌లో పెట్టినట్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఫైళ్ల క్లియరెన్స్‌ కోసం రోజువారీగా అసంఘటిత కార్మికులు ఏఎల్‌వో కార్యాలయానికి వచ్చి ఆరా తీస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. కొందరి పైళ్లు కానరాకుండా పోయినట్లుగా తెలుస్తోంది. అయితే మరుగునపడిన ఫైళ్లను ఒక్కొక్కటిగా వెతికి ఇన్‌చార్జి ఏఎల్‌వో ఫార్వర్డ్‌ చేస్తుండటంతో కార్మికులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. మూడు నెలల కాలంలో ఇప్పటి వరకు 70కి పైగా ఫైళ్లు ఫార్వర్డ్‌ కాగా మరో 100 వరకు ఎక్కడున్నాయో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.

రెగ్యులర్‌ ఏఎల్‌వో వచ్చేదెప్పుడో?

అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి కార్యాలయం పరిధిలో బెల్లంపల్లి, తాండూర్‌, కాసిపేట, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాలు ఉన్నాయి. కార్మిక క్షేత్రం బెల్లంపల్లిలో ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, హెల్పర్స్‌, హమాలీలు, దుకాణాల్లో పనిచేసే గుమాస్తాలు, తదితర రంగాల వర్కర్లు వేల సంఖ్యలో ఉన్నారు. కాసిపేట, తాండూర్‌లో సిమెంట్‌, సిరామిక్స్‌ పరిశ్రమల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, చర్మకారులు, కల్లుగీత కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, కళాకారులు తదితరులు ఉన్నారు. వీరందరికి సేవలు అందించడంలో అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. అంతముఖ్యమైన పోస్టును రెగ్యులర్‌ అధికారితో భర్తీ చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇన్‌చార్జిగా పని చేస్తున్న ఏఎల్‌ఓతో పాటు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ పని భారానికి గురవుతున్నారు. ఏమాత్రం జాప్యం చేయకుండా రెగ్యులర్‌ ఏఎల్‌వోను నియమించి అసంఘటిత కార్మికులకు సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement