డబ్బులు తిరిగివ్వాలని ఆత్మహత్యాయత్నం
● కొండాపూర్ యాపలో టవరెక్కిన బాధితుడు
కాసిపేట: దేవాపూర్ రేంజ్ పరిధిలో పనిచేసే బీట్ అఫీసర్ లత ఎనిమిదేళ్ల క్రితం తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని చుంచు జనార్దన్ అనే వ్యక్తి గురువారం రాత్రి 9 గంటలకు కొండాపూర్‌యాపలో సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. మండలంలోని తుంగగూడకు చెందిన జనార్దన్ వద్ద బీట్ ఆఫీసర్ లత 2018లో ప్లాట్ విషయంలో రూ.2.50 లక్షలు తీసుకుందని, అడిగితే ధూషిస్తోందని వాపోయాడు. పలుమార్లు అటవీశాఖ అధికారులకు, పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో మనస్తాపం చెందినట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న దేవాపూర్ ఎస్సై గంగారాం సంఘటన స్థలానికి చేరుకోని బాధితుడితో ఫోన్‌లో మాట్లాడాడు. అటవీశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో టవర్ దిగాడు.


