ఇంటర్ ఫస్టియర్‌లో ‘ప్రయోగ’ం
మంచిర్యాలఅర్బన్: ప్రయోగాలు చేయడం విజ్ఞానశాస్త్రంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ. శాస్త్ర సాంకేతిక విప్లవంలో ప్రయోగాలకు ప్రధాన స్థానం ఉంది. తరగతిలో విన్న పాఠాన్ని తెలుసుకునేందుకు కృత్యాలు.. ప్రయోగాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో మాత్రమే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయోగాల కు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరంలోనే విద్యార్థులకు నేర్పించాల్సి ఉన్నా చాలా కళాశాలల్లో బోధనోపకరణాలపై దుమ్ము పేరుకుపోయి కనిపిస్తుంది. రెండో సంవత్సరంలో మాత్రమే నిర్వహిస్తున్న ప్రయోగాలను వచ్చే ఏడాది నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విషయ పరిజ్ఞానం పెరుగుదలకు ప్రయోగ పరీక్షలు ఎంతో దోహదపడుతాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 4699, రెండో సంవత్సరం విద్యార్థులు 3528 మంది ఉన్నారు. ఎంపీసీ, బైపీసీ, వృత్తి విద్య విద్యార్థులు ప్రయోగం చేయడంతో విషయ పరిజ్ఞానం పెరుగనుంది. ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణ ద్వారా మొదటి సంవత్సరం నుంచి సన్నద్ధమవుతారు. ప్రస్తుతం రెండో సంవత్సరంలో నిర్వహించడం వల్ల విషయ పరిజ్ఞానంలో వెనుకబడి పోతున్నారు. గతేడాది ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో ప్రయోగ పరికరాలకు ఒక్కో కళాశాలకు రూ.25వేల చొప్పున నిధులు మంజూ రు చేసింది. రసాయనశాస్త్రంలో లవణ, విశ్లేషణ, మూలకాలు, తదితర వాటి గురించి తెలియాలంటే రసాయనాలు అవసరం. హైడ్రో క్లోరిక్ యాసిడ్, సల్ఫర్ యాసిడ్‌తో 24 రకాల సాల్ట్(లవణాలు) అవసరమైన పరికరాలు కొనుగోలు చేశారు. బోట నీ, జువాలజీ ల్యాబ్స్‌లో జంతు కళేబరాలు, అవశేషాలు విద్యార్థులకు చూపించాలి. ఆకు, కాండం తదితర విషయాలు తెలుసుకునేందుకు మెక్రోస్కోప్‌లు వినియోగించడంతో విద్యార్థులకు నైపుణ్యాలు మెరుగుపడే వీలుంటుంది.


